ధర్మ సందేహాలు: వాకింగ్ చేస్తూ భగవంతుని ధ్యానం మంచిదేనా?
భగవంతుని ధ్యానం చేసేటప్పుడు శుచిగా ఉండాలంటారు. నేను చాలాకాలం నుండి వాకింగ్ చేసేటప్పుడు భగవద్ధ్యానం చేస్తున్నాను. అది దోషమా? ‘ధ్యానం‘ శుచిగా చేయడం శ్రేష్ఠం. దానికి ఆసనం, ప్రాణాయామం సమకూరాలి. అటు తరువాతనే ధ్యానం. అయితే, నడకలో చేసే దానిని ’స్మరణ’ అంటారు. అది శ్రేష్ఠమైన విషయం. భగవత్ స్మరణ సర్వపాపహరం సర్వాభీష్ట ఫలప్రదం. అది నిరభ్యంతరంగా నడకలో చేయవచ్చు. మీరు చాలా కాలం నుండి చేస్తున్న భగవత్ స్మరణ మంచిదే. ధ్యానానికి గానీ, స్మరణకిగానీ ఆచమనం, సంకల్పం అవసరం లేదు. అవి లేకుండానే ధ్యాన–స్మరణలు చేయవచ్చు. అందులో దోషం ఏమీ లేదు. వాటికి తప్పక ఫలితం ఉంటుంది. పూజ’ అనేది బాహ్యం, మానసికం అని రెండు విధాలు. మానసిక పూజకి దేవుడు ఎదురుగా ఉండనక్కర్లేదు. ఈ మానసిక పూజని కొంతమేరకు ’ధ్యానం’ అని నిర్వచించవచ్చు. బాహ్య పూజకు ఎదురుగా దేవుని బింబం (పటంగానీ, విగ్రహంగానీ) ఎలాగూ అవసరమే కదా! ఆ పూజకు ఆచమనం, సంకల్పం వగైరాలు అవసరమే. బాహ్యపూజ వలన శరీర, మనశ్శుద్ధులు ఏర్పడి మానసికమైన భావన, స్మరణ, ధ్యానం వంటివి శీఘ్రంగా సిద్ధించే అవకాశం కలుగుతుంది. ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారని అంటారు. నిజంగానే అంతమంది దేవతలున్నారా?ముప్పైమూడు కోట్ల మంది దేవతలు ఉన్న మాట నిజమే. ఇక్కడ కోటి అంటే మనం అనుకునే నూరు లక్షలు కాదు. సంస్కృతం లో కోటి అంటే విభాగం అని అర్ధం. మొత్తం ముప్పై మూడు రకాలయిన దేవతలు అని అర్థం వస్తుంది. వారు వరుసగా అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, ఇంద్రుడు, బ్రహ్మ (ప్రజాపతి) కలిపి మొత్తం ముప్పైమూడు మంది దేవతలు.