అత్తమ్మా.. ధాన్యం మాకే అమ్మాలమ్మా...
అత్తిలి(పశ్చిమగోదావరి): సాధారణంగా పెళ్లి, పేరంటాళ్ల సందర్భంలోను.. అదీ కాదంటే ఎన్నికలొచ్చినప్పుడు ఇంటింటీకీ వెళ్లి ముత్తయిదవులకు బొట్టుపెట్టి పేరంటానికి పిలవడం లేదా ఓటు అడగడం రివాజు. కానీ.. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలంలో మాత్రం ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం అమ్మాలంటూ డ్వాక్రా మహిళలు, రెవెన్యూ ఉద్యోగులు ఇంటింటీకీ వెళ్లి బొట్టుపెట్టి మరీ అడుగుతున్నారు. 'సూరమ్మత్తా.. ఇలా రా.. ఇదిగో బొట్టుంచుకో.. ఇది పేరంటం బొట్టు కాదులే. మనూళ్లో ధాన్యం కొనుగోలు కేంద్రం పెట్టాం. వెంకన్న మావకు .. పెద్దిరాజు బావకు చెప్పి కోతలయ్యాక మొత్తం ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రంలోనే అమ్మాలని చెప్పు. మర్చిపోవద్దు అత్తమ్మా' అని విజ్ఞప్తి చేస్తున్నారు. అత్తిలి మండలం బల్లిపాడు, మంచిలి, అత్తిలి, కె. సముద్రపుగట్టు గ్రామాల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.