dialasis centre
-
రోగితో నర్సు చాటింగ్.. రూ. 20 లక్షలు ఇవ్వమంటూ బ్లాక్మెయిల్!
ఇంతవరకు మనం చాలారకాలు దోపిడీల గురించి విన్నాం. అంతేందుకు కార్పొరేట్ ఆసుపత్రులు ఎలా రోగుల పై పెద్ద మొత్తంలో బిల్లు వేసి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారో కూడా మనకు తెలుసు. అయితే ఇక్కడొక నర్సు మాత్రం సరికొత్త విధానంలో రోగిని దోచుకునేందుకు యత్నించి జైలుపాలైంది. (చదవండి: రావణుడి వేషధారణలో పాల ప్యాకెట్ పట్టుకొని..) అసలు విషయలోకెళ్లితే...పోలీసుల కథనం ప్రకారం...పుణేకి చెందిన ఒక డయాలసిస్ రోగి చికిత్స నిమిత్తం డయాలసిస్ సెంటర్‌కు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆ డయాలసిస్ సెంటర్లోని నర్సుతో పరిచయం ఏర్పడింది. అయితే ఆ తర్వాత వాళ్లిద్దరూ చాట్లు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ మేరకు ఓ రోజు ఆమె నువ్వు గనుక రూ. 20 లక్షలు ఇవ్వకపోతే మన చాటింగ్ మెసేజ్‌లను పబ్లిక్‌లో పెట్టడమే కాక ఒక మహిళను మోసం చేశావంటూ సోషల్ మీడియాలో పెట్టి నీ పరువు తీస్తాను అని బెదిరించడం మొదలు పెట్టింది. దీంతో సదరు వ్యక్తి తమకు ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. పోలీసుల ముందస్తు పథకం ప్రకారం పోలీసులు డబ్బులిస్తానని నర్సుకి చెప్పమని ఫిర్యాదు దారుడికే చెప్పారు. అలా ఆ నర్సు డబ్బులు వసూలు చేసేందుకు పుణేలోని రహత్నీలోని శివర్ చౌక్ వద్దకు రాగా వకాడ్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. (చదవండి: ఆ సమయంలో కూడా సేవలందించిన సూపర్ ఉమెన్లు) -
మానవత్వం చాటుకుంటున్న డాక్టర్.. 50కే వైద్యం
కోల్‌కతా: అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు లాక్డౌన్లో అతి తక్కువ ఫీజు తీసుకుని చికిత్స అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు కోల్‌కత్తాకు చెందిన డాక్టర్ ఫ్రౌద్ హలిమ్. అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ జమీర్ ఉద్దీన్ షా అల్లుడౌన హలీం కేవలం 50 రూపాయలకే కిడ్నీ బాధితులకు డయాలసిస్ చికిత్స అందిస్తున్నారు. దీంతో ఎంతో మంది ప్రముఖుల నుంచి ఆయన ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘లాక్డౌన్ కారణంగా ఎంతో మంది ఉద్యోగులు, రోజువారి కూలీలు, ఉద్యోగాలు కోల్పోయారు. చిన్న చిన్న వ్యాపారులు సైతం ఉపాధిని కోల్పోయారు. దీంతో వారంతా అర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనీసం చికిత్స కోసం ఆసుపత్రికి కూడా రాలేని స్థితిలో ఉన్నారు. వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలని నిర్ణయించుకున్నా. దానిలో భాగంగానే రూ.50కి వైద్యం అందిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు. (2 రోజులుగా ఇంట్లోనే కరోనా డెడ్‌బాడీ) ఆర్థికంగా వెనుకబడిన వారికి తమ క్లినిక్‌లో 50 రూపాయల టోకెన్ ఫీజు మాత్రమే తీసుకుని డయాలసిస్ అందిస్తున్నామని ఆయన తెలిపారు. అంతేగాక దశాబ్ధంపైగా డా.హలీం ‘కోల్కత్తా స్వస్త్య సంకల్ప’ అనే అసోసియేషన్‌ను మరో 59 మంది డాక్టర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా ఎలాంటి లాభార్జన లేకుండా అవసరమైన పేద రోగులకు 350 రూపాయలతో డయాలసిస్ చేస్తున్నామని తెలిపారు. -
పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీకి ప్రమాదమా?
నా వయసు 42 ఏళ్లు. ఒక ఏడాదిగా క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నాను. నాకు ఈ మధ్య విపరీతంగా చర్మం దురద పెడుతోంది. ఎందుకిలా జరుగుతోంది? దురద రాకుండా ఉండటానికి ఏం చేయాలి? – ఎమ్. భూమయ్య, కరీంనగర్ డయాలసిస్ చేయించుకునే పేషెంట్స్‌లో చర్మం పొడిగా అవుతుంది. అంతేకాకుండా వాళ్ల రక్తంలో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటంవల్ల కూడా దురద ఎక్కువగా వస్తుంటుంది. చర్మం పొడిగా ఉన్నవాళ్లు స్నానం తర్వాత చర్మంపై వాజిలేన్ లేదా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. రక్తంలో ఫాస్పరస్ తగ్గించే మందులు తీసుకోవడంతో పాటు ఆహారంలో పాల ఉత్పాదనలు, మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి. రక్తహీనత ఉన్నవాళ్తు రక్తం పెరగడానికి మందులు వాడాలి నా వయసు 65 ఏళ్లు. చాలా ఏళ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. ఆ నొప్పులు తట్టుకోలేక చాలాకాలం నుంచి నొప్పి నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్) వాడుతున్నాను. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా?– డి. మాధవరావు, చీరాల పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడినట్లయితే కిడ్నీ దెబ్బతినే అవకాశం లేకపోలేదు. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నేరుగా మెడికల్ షాప్ నుంచి పెయిన్ కిల్లర్స్ తీసుకొని వాడడం మంచిది కాదు. కొన్ని పెయిన్ కిల్లర్స్‌లో రెండు లేదా మూడు రకాల మందులు కలిపి ఉంటాయి. ఇవి కిడ్నీకి చాలా హాని చేస్తాయి. పెయిన్ కిల్లర్స్ కాకుండా ఫిజియోథెరపీ వంటి ఇతర పద్ధతులతో నొప్పి తగ్గించుకోడానికి ప్రయత్నించండి. రోజూ నీళ్లు ఎక్కువగా తాగండి. మీ భుజం నొప్పి తగ్గడం కోసం ఒకసారి మీకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించండి. మీ అంతట మీరే మందులు వాడకండి. బాబు కళ్లూ,కాళ్లు ఉబ్బికనిపిస్తూఉన్నాయి... మా అబ్బాయికి ఆరేళ్లు. పొద్దున్నే లేచినప్పుడు కళ్ల మీద రెప్పలు ఉబ్బి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కాళ్లలో కూడా వాపు కనిపిస్తోంది. యూరిన్ టెస్ట్‌లో ప్రోటీన్ 3 ప్లస్ ఉందని చెప్పారు. ఈ సమస్య ఏమిటి? దీని విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?– ఎమ్. సుభాష్, వరంగల్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబుకు నెఫ్రొటిక్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఉన్నవారికి మూత్రంలో ప్రోటీన్లు ఎక్కువగా పోతుంటాయి. మొదటగా ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. మీరు ఒకసారి మీ బాబుకు 24 గంటల్లో మూత్రంలో ఎంత ప్రోటీన్ పోతుందో తెలుసుకునే పరీక్ష చేయించండి. దానితో పాటు ఆల్బుమిన్ కొలెస్ట్రాల్ పరీక్ష కూడా చేయించండి. నెఫ్రోటిక్ సిండ్రోమ్‌లో సీరమ్ ఆల్బుమిన్ తక్కువగా ఉండి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది చిన్న పిల్లల్లో చాలా సాధారణంగా వచ్చే సమస్య. మొదటిసారి వచ్చినప్పుడు మూడు నెలల పాటు స్టెరాయిడ్స్ వాడాలి. అవి వాడే ముందు మీ బాబుకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేవని నిర్ధారణ చేసుకోవాలి. ఈ వ్యాధి పదిహేనేళ్ల వయసు వరకు మళ్లీ మళ్లీ వస్తుంటుంది. అయితే మొదటిసారే పూర్తి చికిత్స చేయించుకుంటే మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. ఈ పేషెంట్స్ ఉప్పు, కొవ్వు పదార్థాలు తగ్గించి వాడాలి. ఇన్ఫెక్షన్ వస్తే వ్యాధి తిరగబెట్టవచ్చు. అలాంటప్పుడు మొదట ఇన్ఫెక్షన్ నియంత్రించుకోవాలి.డాక్టర్ విక్రాంత్‌రెడ్డి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్,కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
అదే వేదన.. అవే కన్నీళ్లు.. చావుబతుకుల జీవితం
సాక్షి, ఉద్దానం : ‘అదే వేదన.. అవే కన్నీళ్లు. జబ్బు బారిన పడి చావుబతుకుల మధ్య జీవిత పోరాటం. కన్నీళ్లు తుడిచి కాసింత భరోసా ఇచ్చేవారే లేరు. వైద్యం అందకపోతే పట్టించుకునేవారే లేరు. నాలుగు రోజులకోసారి రక్తశుద్ధి రావాలంటే నరకయాతన. డయాలసిస్ భాగ్యం దక్కేవరకూ పడిగాపులు.. ఏదైతేనేం ఉద్దానం కిడ్నీ బాధితుల పరిస్థితిలో మార్పు లేదు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాం.. ఎన్నికల ముందుకు పెన్షన్‌లో వెయ్యి రూపాయలు పెంచి సర్కారు చేతులు దులుపుకుంది.. సమయానికి మందులుండవు.. బయట కొనుక్కునే స్తోమత లేదు.. చావుతో పోరాటం చేస్తున్నాం..’ ఇదీ ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల్లో ఆవేదన. ఉద్దానం ప్రాంతంలో సుమారు 110 గ్రామాల్లో కిడ్నీ బాధితులు ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. ఒక్కో డయాలసిస్ సెంటర్లో 30 మందికి పైగా వేచి చూస్తున్న బాధితులున్నారు. పలాస, సోంపేట, శ్రీకాకుళం, టెక్కలిలో డయాలసిస్ సెంటర్లున్నాయి. తాజాగా కవిటిలో పెట్టారు. ఒక్కో మెషీన్‌కు రోజుకు మూడు డయాలసిస్ సెషన్లు మాత్రమే జరుగుతాయి. వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకోవాలి. కానీ ఇవి సరిపోకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డయాలసిస్ బాధితులకు సరిపడా మందులు ఇవ్వకపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి మందులు మార్చాలి. కానీ కొన్ని రకాల మందులే ఇస్తుండటంతో బయట కొనుక్కుంటున్నామని బాధపడుతున్నారు. ఒక్కో నెలకు రూ.6 వేలు అదనంగా ఖర్చవు తోందని వాపోయారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌లో రాస్తున్నవి వేరు, ఇక్కడ ఇస్తున్నవి వేరు, ఇలా అయితే మేమెలా బతుకుతామని బాధితులు అంటున్నారు. వెయ్యి పెంచి చేతులు దులుపుకున్నారు.. గత కొన్నేళ్లుగా తమకు రూ.10 వేలు పెన్షన్ ఇస్తేగానీ సరిపోదని అడుగుతుంటే ప్రభుత్వం మాత్రం రూ.2,500 ఇస్తూ, ఎన్నికల ముందు మరో రూ.వేయి మాత్రమే పెంచిందని పలువురు బాధితులు వాపోయారు. రెండు మూడేళ్లలో చచ్చిపోయేవాళ్లం కదా ఆ మాత్రం కూడా ప్రభుత్వానికి కనికరం లేదంటే ఏమనుకోవాలని ఆవేదనగా వాపోయారు. అదీగాక రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మంది వరకూ బాధితులుండగా, కేవలం 3,500 మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నట్టు బాధితులు చెప్పుకొచ్చారు. జగన్ హామీతో బాధితుల్లో భరోసా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కిడ్నీ, గుండెజబ్బులు, తలసీమియా వంటి బాధితులకు నెలకు రూ.10 వేలు పెన్షన్ ఇస్తామన్న వైఎస్ జగన్మోహనరెడ్డి హామీతో బాధితుల్లో కాసింత భరోసా వచ్చింది. మందులకయ్యే వ్యయం మొత్తం తామే భరించి పెన్షన్ రూ.10 వేలు చేస్తే అంతకంటే తమకు కావాల్సింది ఏముంటుందని ఉద్దానం ప్రాంత బాధితులు అంటున్నారు. ప్రస్తుతం కొంతమంది బాధితులకే పెన్షన్ వస్తోందని, జగన్ వస్తే బాధితులందరికీ పెన్షన్ ఇస్తారన్న ఆశతో ఉన్నట్టు అక్కడి బాధితులు చెబుతున్నారు. అత్యవసరమైతే విశాఖ వెళ్లాల్సిందే గత కొంతకాలంగా కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నాను. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. అత్యవసరం అనుకుంటే విశాఖ వెళ్లి డయాలసిస్ చేయించుకోవాలి. మందులు కూడా సరిగా ఇవ్వడం లేదు. ఈ బాధలు పగవాడికి కూడా వద్దు. రూ.2,500 ఇస్తున్న పెన్షన్‌కు మరో వెయ్యి పెంచారు. ఇది ఏమూలకు సరిపోతుంది? . –అప్పలస్వామి, గొల్లమూకన్న పల్లి, పలాస ఎక్కువ రోజులు బతకబోమని తెలిసి కూడా.. నా భార్య జయలక్ష్మి ఇక్కడ డయాలసిస్ చేయించుకుంటోంది. మందులు సరిగా అందడం లేదు. పెన్షను 3,500 ఇస్తే, ఒక్కసారి డయాలసిస్‌కు వస్తే ఖర్చవుతోంది. మేము ఎక్కువ రోజులు బతకమని తెలిసి కూడా రూ.3,500 పెన్షన్ మాత్రమే ఇవ్వడం బాధిస్తోంది. –కోటేశ్వరరావు, (కిడ్నీ బాధితురాలు జయలక్ష్మి భర్త), అక్కుపల్లి, ఉద్దానం – గుండం రామచంద్రారెడ్డి, ఉద్దానం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
ఆగుతూ.. సాగుతూ..
డయాలసిస్ బాధితులకు రక్తశుద్ధి ఆగుతూ.. సాగుతోంది. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే జిల్లాలోని రెండు డయాలసిస్ కేంద్రాలూ పనిచేయడం లేదు. జనరేటర్లు లేకపోవడంతో రక్తశుద్ధి గంటల తరబడి నిలిచిపోతోంది. దీంతో రోగులు అవస్థ పడుతున్నారు. దీనికితోడు నెఫ్రాలజిస్ట్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్లే డయాలసిస్ చేస్తున్నారు. డ్యూటీ డాక్టర్లే పర్యవేక్షిస్తున్నారు. కొత్తగూడెంరూరల్ : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రి, భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఒక్కోటి చొప్పున రెండు డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇందుకోసం రూ.1.2 కోట్లు వెచ్చించింది. ఇవి కిడ్నీలు పనిచేయని వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గతంలో హైదరాబాద్ వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసి, వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకునేవారు. ఇక్కడ ఏర్పాటు చేశాక వ్యయప్రయాసలు తగ్గిపోయాయి. కానీ వైద్యనిపుణులను నియమించకపోవడం, మౌలిక సదుపాయాలను కల్పించకపోవడంతో బాధితులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. కొత్తగూడెంలో.. గత నెల 12న కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభించారు. 4 నెగిటివ్ బెడ్స్, మరొకటి పాజిటివ్ బెడ్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రోజు 20 మంది పేషెంట్ల వరకు డయాలసిస్ కోసం వస్తున్నారు. కానీ ఇక్కడ నెఫ్రాలజిస్ట్ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లే రక్తశుద్ధి ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పేషెంట్‌కు ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితని బాధితులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆయా పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఒక పేషెంట్‌కు నాలుగు గంటల వరకు రక్తశుద్ధి చేస్తారు. ఇలా 24 గంటల వరకు ఆరుగురికి, మొత్తం నాలుగు బెడ్స్‌లో రోజుకు 24 మందికి రక్తశుద్ధి చేస్తారు. కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు రోజుకు సుమారు 20 మంది చొప్పున 515 మంది డయాలసిస్ చేయించుకున్నారు. కరెంటు పోతే ఇబ్బందులే.. ఆస్పత్రికి జనరేటర్ ఉన్నా డయాలసిస్ కేంద్రానికి ప్రత్యేకంగా జనరేటర్ సౌకర్యం లేదు. ఎక్కువ సమయం కరెంటు పోతే డయాలసిస్‌ను మధ్యలోనే నిలిపివేస్తున్నారు. మళ్లీ కరెంటు వచ్చినా తర్వాత రక్తశుద్ధిని కొనసాగిస్తున్నారు. వేసవి కాలం నేపథ్యంలో తరచూ కరెంటు పోతుండటం వల్ల రక్త శుద్ధి ఆగిపోతోంది. దీంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. భద్రాచలంలో.. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఈ నెల 3న డయాలసిస్ కేంద్రం ప్రారంభించారు. ఇప్పటి వరకు 171 మందికి రక్తశుద్ధి చేశారు. కేంద్రంలో ఆయాల పోస్టు ఖాళీగా ఉన్నాయి. జనరేటర్ సౌకర్యం లేదు. కరెంటు పోతే రోగులు ఇబ్బందులు పడక తప్పదు. నెఫ్రాలజిస్టు కూడా లేరు. రోజుకు మూడు షిఫ్టుల చొప్పున ఒక్కో షిఫ్టునకు ఒక టెక్నీషియన్, ఒక స్టాఫ్ నర్స్.. మొత్తం ఆరుగురు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డయాలసిస్ కేంద్రాలకు ప్రత్యేకంగా జనరేటర్తోపాటు, నెఫ్రాలజిస్ట్ పోస్టులను నియమించాలని పలువురు కోరుతున్నారు. -
నిలిచిపోయిన డయాలసిస్
పార్వతీపురం: కిడ్నీవ్యాధిగ్రస్థులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉన్న పార్వతీపు రం ఏరియా ఆస్పత్రిలోని డయాలసిస్ కేంద్రంలో సేవలు నిలిచిపోయాయి. హైఓల్టేజ్ కారణంగా ముఖ్యమైన యంత్రాలు ధ్వంసం కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పటివరకు 72మంది రోగులు ఈ కేం ద్రం ద్వారా సేవలు పొందుతున్నారు. కేంద్రం ఏర్పాటు చేసి 13నెలలు అయినప్పటికీ ఇక్కడి సేవలకు ఎంతో గుర్తింపు లభించింది. గత శుక్రవారం హైఓల్టేజ్ రావడంతో డయాలసిస్ యూనిట్ వద్ద ఏర్పాటు చేసిన స్టెబిలైజర్ పాడైంది. డయాలసిస్ యంత్రాలు ధ్వంసమయ్యాయి. ఫలితంగా డయాలసిస్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో డయాలసిస్ కేంద్రం నిర్వాహకులు రోగులను పక్క జిల్లాలోని పాలకొండలో ఉన్న డయాలసిస్ కేంద్రానికి తరలిస్తున్నారు. అక్కడ వారికి సేవలు అందిస్తున్నారు. రూ. 10 లక్ష లమేర నష్టం.. ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి డయాలసిస్ కేంద్రానికి నేరుగా విద్యుత్ సరఫరాను అందించే కేబుల్‌ను కూడా డయాలసిస్ యూనిట్ నిర్వాహకులే ఏర్పాటు చేస్తున్నారు. స్టెబిలైజర్‌ను కూడా ఏర్పాటు చేశారు. అధిక విద్యుత్ సరఫరా అయిన సమయంలో వాటిని సరిదిద్ది పంపించే స్టెబిలైజర్‌లో న్యూట్రల్ వ్యవస్థ పాడవ్వడం, వైర్లు కాలిపోయి తెగిపోవడంతో ఒక్కసారిగా స్టెబిలైజర్ ద్వారా అత్యధిక ఓల్టేజీ ప్రసారం కావడంతో డయాలసిస్ కేంద్రంలోవున్న ఆరు మిషన్లకు విద్యుత్ సరఫరా జరగడంతో అందులోవున్న ఎస్‌ఎంపీఎస్ బోరŠుడ్స,(స్విచ్మోడ్ ఫవర్ సప్లై), కొన్ని హీటర్ ఫ్యూజులు కాలిపోవడంతో మిషన్లు పనిచేయకుండా పోయాయి. సుమారు రూ. 10లక్షలు ఆస్తినష్టం జరిగినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి అవసరమైన స్పేర్ పాట్స్ వచ్చిన తరువాత యంత్రాలను బాగుచేస్తామని, తరువాత రోగులకు సేవలు అందిస్తామని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షిస్తున్నాం. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి అత్యధిక ఓల్టేజీ రావడంతో మిషన్లు పాడై రూ. 10 లక్షల వరకు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం న్యూట్రల్ పాయింట్‌ను సరిచేశాం. తద్వారా సేవలు కొనసాగించడానికి పక్క కేంద్రాలనుంచి డయాలసిస్ మిషన్లను తెప్పిస్తాం. పూర్తి సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నాం. రెండు, మూడు రోజుల్లో తిరిగి సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.– డా. జి.నాగభూషణరావు,సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి న్యూట్రల్ పాయింట్ కాలిపోవడంవల్లే... డయాలసిస్ కేంద్రంలో ఏర్పాటు చేసిన స్టెబిలైజర్ న్యూట్రల్ వైర్లు కాలిపోవడంవల్లే స్టెబిలైజర్ గుండా 450 ఓల్టేజ్ ప్రవహిం చింది. తద్వారా మిషన్లోవున్న ఎస్‌ఎంపీఎస్ బోర్లు కాలిపోయాయి. కేంద్రం లోవు న్న అన్ని మిషన్లు పనిచేయకుండా పోవడంతో రోగులకు ప్రత్యామ్నాయంగా పాలకొండ డయాలసిస్ కేంద్రానికి పంపిస్తున్నాం. – జితేంద్ర, నెప్రో ఇంజనీర్ -
ప్రపంచ బ్యాంకు నిధులతో ఆస్పత్రుల అభివృద్ధి
హిందూపురం అర్బన్ : ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రభుత్వాస్పత్రుల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించడానికి కేబినెట్ ఆమోదించిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసులు అన్నారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్‌ను ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. అలాగే ఆసుపత్రిలో ఆవరణలో అన్న క్యాంటిన్, మినరల్ వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వారితోపాటు పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, ఎంపీ నిమ్మల కిష్టప్ప, కలెక్టర్ కోన శశిధర్, వైద్య విధాన పరిషత్ చైర్మన్ బీకేనాయక్ హాజరయ్యారు. ఈసందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి కామినేని శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రసుత్తం హిందూపురంలో ప్రారంభించామన్నారు. అలాగే ఆస్పత్రుల్లో ప్రసవాలను పెంచామన్నారు. తద్వారా మాతా శిశు మరణాలు నివారించామన్నారు. ఓపీ కూడా 28 శాతం పెరిగిందన్నారు. హిందూపురం ఆసుపత్రికి శనివారం అనస్థీషియన్‌ను నియమిస్తున్నామని చెప్పారు. అనంతరం మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ బాలకృష్ణ వచ్చిన తర్వాతే హిందూపురం అభివృద్ధి జరుగుతోందన్నారు. శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టును సమర్థవంతంగా నిర్వహించాలని బాలకృష్ణను కోరారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ బెంగళూరు రాయయ్య ఆసుపత్రిలో ఆరోగ్యసేవ సదుపాయం అందించడానికి చర్చిస్తున్నామన్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ లక్ష్మి, బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, ఆసుపత్రి కమిటీ చైర్మన్ వెంకటస్వామి పాల్గొన్నారు.