ప్రపంచంలో తొలి డైమండ్ ఫ్యూచర్స్!
ట్రేడింగ్ ప్రారంభించిన ఐసీఈఎక్స్
ముంబై: అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన ఇండియన్ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఐసీఈఎక్స్) సోమవారం డైమండ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తద్వారా ప్రపంచంలోనే డైమండ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌ను ప్రారంభించిన మొట్టమొదటి డెరివేటివ్స్ ఎక్సే్ఛంజ్‌గా నిలిచింది. ‘‘కంపల్సరీ డెలివరీతో తొలి దశలో 1 క్యారెట్ పరిమాణంలో కాంట్రాక్ట్స్ను ప్రారంభించాం. డైమండ్ లావాదేవీలు నిర్వహించేవారికి ఇది పూర్తి పారదర్శకమైన కొత్త మార్కెట్‌ను సృష్టిస్తుంది. వివిధ కొనుగోలుదారులకు తమ సర్టిఫైడ్ డైమండ్స్‌ను అమ్మకందారులు తప్పనిసరిగా డెలివరీ ఇవ్వాల్సి ఉంటుంది’’అని ఐసీఈఎక్స్ మేనేజింగ్ డైరెక్టర్ సంజిత్ ప్రసాద్ విలేకరులకు తెలిపారు.
తరువాత తప్పనిసరి డెలివరీతో 30 సెంట్లు, 50 సెంట్ల కాంట్రాక్టులు ప్రారంభించాలన్నది ఐసీఈఎక్స్ ప్రణాళిక. ఇందుకు ఇప్పటికే మార్కెట్ రెగ్యులేటర్– సెబీ ఆమోదముద్ర వేసింది. ట్రేడింగ్ పరిమాణం రోజుకు దాదాపు రూ.5,000 కోట్ల మేర ఉండే వీలుందని ప్రసాద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ రోజు వరకూ 100 మంది సభ్యులు, 4,000 మంది క్లెయింట్లు ఎక్సే్ఛంజ్‌లో రిజిస్టర్ చేయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. కమోడిటీ మార్కెట్ల తదుపరి పురోగతిదిశలో ఇది తాజా ముందడుగని రత్నాలు, ఆభరణ ఎగుమతి మండలి చైర్మన్ ప్రవీణ్ శంకర్ పాండ్య తెలిపారు.