తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన జుకర్ బర్గ్
మిన్నెసోట: మిన్నెసోటాలో నల్లజాతి పౌరుడు ఫిలాండో కాస్టిల్ కాల్చివేతపై ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను అమితంగా కలిచివేసిందని అన్నారు. ఇలాంటి ఘటనలు ఎప్పటికీ జరగకూడదని కోరుకోవాలని అన్నారు. ఓ పక్క లైసెన్స్ అడుగుతూనే వివరణ ఇచ్చేలోగా తన భార్య ముందు ఫిలాండో అనే నల్లజాతి పౌరుడిని పోలీసులు అతి దారుణంగా కాల్చి చంపగా అది ఫేస్ బుక్ లైవ్ లో ప్రపంచానికి కనిపించింది. దీనిపై జుకర్ ఇలా స్పందించారు.
‘నిన్న మిన్నెసోటాకు చెందిన డైమండ్ రైనాల్డ్ అనే మహిళ తన ఫియాన్సీ ఫిలాండో కాస్టిల్ కారులో కాల్పులకు గురైన తర్వాత ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చింది. బుల్లెట్ గాయాలతో ఫిలాడో ప్రాణాలు విడిచాడు. ఈ వీడియోలో నాలుగేళ్ల వారి పాప ఈ దారుణ దృశ్యాన్ని వెనుక సీట్లో కూర్చొని బిక్కుబిక్కుగా చూస్తోంది. కాస్టిల్ కుటుంబానికి జరిగిన ఘటన నా గుండెను పిండేసింది. చాలా కుటుంబాలు ఈ వీడియో చూసి ఒక రకమైన విషాదంలోకి వెళ్లాయి. ఇలాంటి సంఘటనలతో ఫేస్బుక్ యూజర్లకు కలుగుతున్న బాధలో నా బాధ కూడా ఉంది.
ఈ వారం వెలుగులోకి వచ్చిన ఎన్నో సజీవ చిత్రాలు, సంఘటనలు లక్షలమందిని భయం గుప్పిట్లోకి తీసుకెళుతున్నాయి. డైమండ్ కుటుంబానికి జరిగిన ఘటనలాంటిది మరొకటి చూడకూడదని మనం బలంగా కోరుకుందాం. ఈ సంఘటన మనం ఎందుకు ఒక చోట కలిసి మరింత దగ్గరిగా ఒక ప్రపంచంగా బ్రతకాలో.. ఎంత దూరం వరకు వెళ్లాలో విషయాన్ని మరోసారి గుర్తు చేస్తుంది’ అని ఆయన తన ఫేస్ బుక్ పేజీలో రాశారు.