ఐదుగురు ఘరానా దొంగలకు చెక్
రూ.65 లక్షల సొత్తు స్వాధీనం
వీడిన 78 చోరీ కేసుల మిస్టరీ
సాక్షి, సిటీబ్యూరో: కరుడుగట్టిన ఐదుగురు దొంగల ఆగడాలకు సైబరాబాద్ క్రైమ్ పోలీసులు చెక్ పెట్టారు. ఏడాది కాలంగా రెచ్చిపోతున్న వీరిని అరెస్టు చేసి... 50 ఇళ్ల చోరీలు, 26 స్నాచింగ్స్, రెండు బైక్‌ల చోరీల గుట్టు విప్పారు. నిందితుల నుంచి రూ.65 లక్షల విలువైన 1.8 కిలోల బంగారం, 3.2 కిలోల వెండి వస్తువులు, మూడు ద్విచక్రవాహనాలు, ల్యాప్‌టాప్, డైమండ్ రిస్ట్‌వాచ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఐదుగురి వివరాలను కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం తెలిపారు.
పగటి దొంగ...
ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన సయ్యద్ హమీద్ అలియాస్ అహ్మద్ (33) పగలు మాత్రమే చోరీలు చేస్తాడు. తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసుకొని సొత్తు ఎత్తుకెళ్తారు. ఇతగాడు గతంలో మీర్‌పేట, చందానగర్, పేట్‌బషీరాబాద్, ఉప్పల్, కూకట్పల్లి, కుషాయిగూడ, వరంగల్, కరీంనగర్, రామ్‌గోపాల్‌పేట్, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లలో చోరీలు చేసి జైలుకెళ్లొచ్చాడు. జైలు నుంచి వచ్చాక మీర్‌పేట, చందానగర్, రాయదుర్గం, నాచారం, హయత్‌నగర్, వనస్థలిపురం, మల్కాజిగిరి, మేడిపల్లి, ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని 26 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు.
రాత్రి దొంగ...
గుంటూరు జిల్లాకు చెందిన చెరుకుమల్లి కోటేశ్వరరావు (33) రాత్రి మాత్రమే చోరీలు చేస్తాడు. తాళాలు వేసిన ఇళ్లను ఎంచుకొని సొత్తు ఎత్తుకెళ్తాడు. ఇతడు గతంలో విజయవాడ, నర్సారావుపేట, సత్తెనపల్లి, గుంటూరులలో చోరీలకు పాల్పడి జైలుకెళ్లి వచ్చాడు. బయటకు వచ్చాక సైబరాబాద్,హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 20 చోరీలకు పాల్పడ్డాడు.
ఇద్దరు స్నాచర్లు....
కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన మహ్మద్ ఖలీల్ (23), మెదక్ జిల్లా రామాయన్‌పేటకు చెందిన ఓరడు రాజు అలియాస్ జ్ఞానప్రకాష్ (38) స్నాచర్లు. బైక్‌పై తిరుగుతూ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే మహిళల మెడలోని నగలు తెంచుకుపోతుంటారు. గతంలో వీరు నేరేడ్మెట్లో రెండు హత్యలతో పాటు ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో స్నాచింగ్‌లకు పాల్పడి జైలుకెళ్లి వచ్చారు. ఆ తర్వాత మల్కాజిగిరి, ఉప్పల్, జీడిమెట్ల, మీర్పేట్, అల్వాల్ ఠాణాల పరిధిలో ఇద్దరూ కలిసి 26 స్నాచింగ్‌లకు పాల్పడ్డారు.
బైక్ దొంగ...
అనంతపురం జిల్లా కలిగిరికి చెందిన కర్రావుల శ్రీనివాస్‌రెడ్డి (22) రాత్రి పూట ఇంటి దొంగతనాలతో పాటు బైక్‌ల చో రీకి పాల్పడుతున్నాడు. గతేడాది జూలై 3న పోలీసులకు చిక్కి జైలుకెళ్లాడు. బయటకు వచ్చాక కుషాయిగూడ, మల్కాజిగి రి, నాచారం ఠాణాల పరిధిలో నాలుగు ఇళ్లు దోచుకున్నాడు. దీంతో పాటు రెండు చోట్ల ద్విచక్ర వాహనాలను ఎత్తుకెళ్లాడు.
51 మంది అధికారులకు క్యాష్ రివార్డులు
ఈ ఏడాదిలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 51 మంది పోలీసు అధికారులకు కమిషనర్ సీవీ ఆనంద్, జాయింట్ పోలీసు కమిషనర్ వై.గంగాధర్, ఇన్‌ఛార్జి క్రైమ్ డీసీపీ జి.జానకీషర్మిల క్యాష్‌రివార్డుతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. వీరిలో 8 మంది ఇన్స్పెక్టర్లు, 8 మంది ఎస్ఐలు, నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 30 మంది కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు ఉన్నాడు. విలేకరుల సమావేశంలో సరూర్‌నగర్, అల్వాల్, రాజేంద్రనగర్ సీసీఎస్, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్లు బి.రాములునాయక్, కె.శ్రీనివాస్‌రావు, నర్సింహ్మారెడ్డి పాల్గొన్నారు.