రోగులపట్ల అలసత్వం వహిస్తే చర్యలు
నెలవారీ సమీక్షలో ఇన్చార్జి డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రవీణ్
శ్రీకాకుళం అర్బన్: విధి నిర్వహణలో రోగులపట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని ఇన్చార్జి వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మెండ ప్రవీణ్ హెచ్చరించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఎంపీహెచ్‌ఈవో, సీహెచ్‌వోల నెలవారీ సమీక్షలో ఆయన మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే అన్ని పీహెచ్‌సీలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మారుమూల ప్రాంతాల నుంచి వైద్యసేవలు పొందేందుకు ఆసుపత్రికి వస్తున్న రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. వైద్యులు, వైద్య సిబ్బంది స్థానికంగానే ఉంటూ ఖచ్చితమైన సమయపాలన పాటించాలన్నారు. బయోమెట్రిక్‌ను నిర్లక్ష్యం చేస్తే వేతనాల్లో కోత తప్పదని హెచ్చరించారు. మందులు అన్ని పీహెచ్‌సీల్లో ఉన్నాయో లేవో పరిశీలించుకుని ఇండెంట్ మేర అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. సీజన్ ప్రభావం అధికంగా ఉన్నందున గ్రామాల్లో వైద్య సిబ్బంది పర్యటించాలన్నారు. జ్వరాలు, డయేరియా వ్యాధుల గ్రామాల్లో ఉన్నదీ లేనిదీ ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఏఎన్ఎంలను ఆదేశించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయ ఏవో డాక్టర్ దవళ భాస్కరరావు, డాక్టర్ హేమంత్, ఎంపీహెచ్‌ఈవోలు, సీహెచ్‌వోలు పాల్గొన్నారు.