భిన్నాభిప్రాయాలు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవుల రద్దుకు సర్కారు యోచన
అధికారాలు లేనప్పుడు రద్దే మేలంటున్నవారు కొందరు
పదవుల బలోపేతం దృష్టి పెట్టాలని మరికొందరి సూచన
ఐదంచెల వ్యవస్థ రద్దుపై స్థానిక ప్రతినిధుల్లో చర్చ
కరీంనగర్ సిటీ : ప్రస్తుతం ఉన్న ఐదంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను రద్దు చేసి, గతంలోని మూడంచెల వ్యవస్థను తిరిగి తేవాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారాలు, నిధులు లేక సమాంతర పదవులతో అలంకారప్రాయంగా ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులను రద్దు చేయాలని ప్రభుత్వం సంకల్పించడం తెలిసిందే. 1987లో ఎన్టీ.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పంచాయతీ సమితిల స్థానంలో మండల వ్యవస్థను తీసుకొచ్చారు. సర్పంచ్, మండలాధ్యక్షుడు, జిల్లా పరిషత్ అధ్యక్షుడి పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహించారు. ఆ తరువాత 1995లో కాంగ్రెస్ ప్రభుత్వం మూడంచెల వ్యవస్థను ఐదంచెలుగా మార్చింది. గ్రామ స్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీ, మండల స్థాయిలో ఎంపీపీ, జెడ్పీటీసీ, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవులతో ఐదంచెల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. అప్పటినుంచి గ్రామస్థాయిలో సర్పంచ్‌కు సమాంతరంగా ఎంపీటీసీ, మండల స్థాయిలో ఎంపీపీకి సమాంతరంగా జెడ్పీటీసీ పదవులు పుట్టుకొచ్చాయి.
అలంకారప్రాయమే...
ఐదంచెల వ్యవస్థలో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు ఏర్పడినా నిధులు, విధుల విషయంలో సమాన అధికారాలు దక్కలేదనే విమర్శలున్నాయి. పైపెచ్చు సమాంతర పదవుల్లో ఉన్న సర్పంచ్, ఎంపీటీసీలతోపాటు ఎంపీపీ, జెడ్పీటీసీలు కలహించుకొనే పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరంగా మారింది. తాము కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచినా సర్పంచ్‌లు, ఎంపీపీల స్థాయిలో తమకు గౌరవం, అధికారాలు, నిధులు దక్కడం లేదనే ఆవేదనను ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అనేక సందర్భాల్లో లేవనెత్తారు. నిధులు, విధుల కోసం ఆందోళనలు సైతం నిర్వహించారు. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు అధికారాలు, నిధులు అంతంతమాత్రంగా ఉండగా ఇటీవలి కాలంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారైంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను నేరుగా గ్రామపంచాయతీలకే విడుదల చేయడంతో మండల పరిషత్, జిల్లా పరిషత్ వ్యవస్థలు ఆర్థిక లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి.
భిన్నాభిప్రాయాలు..
పంచాయతీరాజ్ వ్యవస్థలో గతంలో మాదిరిగా మూడంచెల వ్యవస్థనే మేలని కొంతమంది, ఐదంచెల వ్యవస్థను రద్దు చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ పదవులను రద్దు చేయాలంటున్న వారు... ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్లు ఒకే స్థాయిలో సర్పంచ్–ఎంపీటీసీ, ఎంపీపీ–జెడ్పీటీసీ పదవులతో పాలనాపరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. కనీసం తమకు కార్యాలయాలు కూడా లేవని ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పేర్కొంటున్నారు. అలాంటప్పుడు అలంకారప్రాయంగా మారిన పదవులు అవసరం లేదంటున్నారు. గ్రామస్థాయిలో సర్పంచ్, మండల స్థాయిలో మండల అధ్యక్షుడు, జిల్లాస్థాయిలో జెడ్పీ చైర్మన్లను నేరుగా ఎన్నుకొనే వ్యవస్థ కావాలంటున్నారు.
ఇక ఐదంచెల వ్యవస్థ ఉండాలని కోరుతున్నవారు... ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీలే కాదు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు కూడా అధికారాలు, నిధుల విషయంలో సంతృప్తిగా లేరని ప్రస్తావిస్తున్నారు. సర్పంచ్‌లను మినహాయిస్తే స్థానిక సంస్థల వ్యవస్థలోని ఏ ఒక్క పదవికి పూర్తిస్థాయి అధికారాలు, నిధులు, విధులు లేవంటున్నారు. అలాంటప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోస్టులు రద్దు చేసినంత మాత్రాన ఒనగూరే ప్రయోజనమేమీ లేదంటున్నారు. ఉన్న పదవులకు అధికారాలు బదలాయించి, నిధులు, విధులు అప్పగిస్తే స్థానిక సంస్థలు మరింత బలోపేతమవుతాయని సూచిస్తున్నారు.
మూడంచెల వ్యవస్థే మేలు
–తన్నీరు శరత్‌రావు, జెడ్పీటీసీ, బెజ్జెంకి
రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం మంచిదే. అధికారాలు లేని పదవులు ఉన్నా ప్రజలకు ఎలాంటి ఫలితం ఉండదు. సమాంతర పదవుల కారణంగా పాలనాపరంగా సమస్యలు తలెత్తడం తప్పితే ప్రయోజనం లేదు. పూర్తిస్థాయి అధికారాలు ఉంటేనే ప్రజలకు మేలు చే యగలుగుతాం. గ్రామాలను అభివృద్ధి పరచగలుగుతాం. మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేసినా ఆ పదవులకు అధికారాలు కట్టబెడితేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.
రద్దుతో ప్రయోజనం లేదు
–చల్ల నారాయణరెడ్డి, జెడ్పీటీసీ, కాటారం
ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులను రద్దు చేసినంత మాత్రాన ప్రయోజనం లేదు. అధికార వికేంద్రీకరణకు ప్రస్తుతమున్న ఐదంచెల వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది. అధికారాలు, నిధుల్లో కోత విధించి ఆ పదవులకు విలువ లేకుండా చేసింది ప్రభుత్వాలే. ఐదంచెల వ్యవస్థను అలానే ఉంచి నిధులు, విధులు, అధికారాలతో బలోపేతం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది.
అధికారాలు లేని పదవులెందుకు?
–దీకొండ భూమేశ్, ఎంపీటీసీ, ఐత్రాజుపల్లి
ప్రజలు కోరితే కనీసం గ్రామంలో సొంతంగా ఒక పని కూడా చేయలేని దుస్థితిలో ఎంపీటీసీలు ఉన్నారు. పంచాయతీ కార్యాలయంలో ఒక చాంబర్ సైతం లేదు. ఎంపీపీ ఎన్నికల్లో ఓటు వేయడానికి తప్పితే మాకు ఐదేండ్లు పనే లేదు. అధికారాలు, విధులు ఉంటేనే ప్రజలకు సేవచేయగలం. అధికారాలు లేని ఈ పదవులు అవసరం లేదు. మూడంచెల వ్యవస్థ అమలు చేయడం వల్ల స్థానిక సంస్థలు బలోపేతమవుతాయి.
అధికారాలపై దృష్టిపెట్టండి
–కల్లెపల్లి వెంకటమ్మ, ఎంపీటీసీ, గర్రెపల్లి
పదవులను రద్దు చేయాలనే ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఆ పదవులను బలోపేతం చేయడంపై దృష్టి పెడితే మంచిది. ఐదంచెల వ్యవస్థలో ఉన్న పదవుల పరంగా అధికారాలు విభజించి, అందుకు సరిపడా నిధులు కేటాయిస్తే ఏ పదవిని రద్దు చేయాల్సిన అవసరం ఉండదు. పైగా నిధులు ఇవ్వకుండా, అధికారాలు బదలాయించకుండా మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేసినా ఫలితం శూన్యమే.