ఆంధ్రాబ్యాంక్ ‘రక్షాబంధన్’ ప్రత్యేక పథకాలు
హైదరాబాద్: రక్షాబంధన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలలో జీరో అకౌంట్ తీసుకున్న ఖాతాదారులకు ఆంధ్రాబ్యాంక్ వివిధ స్కీమ్‌లను ప్రవేశపెట్టిందని హైదరాబాద్ సర్కిల్ జనరల్ మేనేజర్ వినయ్‌శర్మ తెలిపారు. హైదరాబాద్ సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆయా ఖాతాల్లో వ్యక్తిగతంగా లేదా బంధువులు, స్నేహితులు నగదు లేదా గిఫ్ట్ చెక్కు రూపంలో డిపాజిట్ చేస్తే పథకాలు వర్తిస్తాయన్నారు. గిఫ్ట్ చెక్కులు రూ. 201, రూ. 351, రూ. 5,001 గుణిజాల్లో లభిస్తాయి. రూ.201 గిఫ్ట్ చెక్కు చెల్లిస్తే రూ.2లక్షల ప్రమాదబీమా వర్తిస్తుందని తెలిపారు.
అలాగే మరో పథకమైన జీవన్ సురక్షా డిపాజిట్ పేరిట రూ.5,001 చెల్లిస్తే రూ.2 లక్షల ప్రమాదబీమా, జీవితబీమాలు వినియోగదారులకు అందించనున్నట్లు తెలిపారు. ఈ రెండు పథకాల్లో పలు సంవత్సరాల కవరేజీ వుంటుందన్నారు. జీవన్సురక్షా గిఫ్ట్సెట్ కోసం రూ.351 చెల్లిస్తే రూ. 2లక్షల ప్రమాదబీమా, రూ.2లక్షల జీవితబీమా వర్తిస్తాయని తెలిపారు. ఇది ఒక సంవత్సరం మాత్రమే పనిచేస్తుందని చెప్పారు. సమావేశంలో ఆంధ్రాబ్యాంక్ హైదరాబాద్ జోనల్ 1 డీజీఎం చక్రవర్తి, హైదరాబాద్ జోనల్2 డీజీఎం సి.వి.రఘునాథ్, ఏజీఎం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.