నటుడి ఇంటి వద్ద పోలీసు భద్రత
కేకే.నగర్(చెన్నై): దివ్యాంగులను కించపరిచేలా మాట్లాడిన మాట్లాడిన డీఎంకే నేత, నటుడు రాధారవిపై నిరసన జ్వాలలు బయలుదేరాయి. ఈ నేపథ్యంలో రాధారవి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. మింట్లో ఇటీవల జరిగిన డీఎంకే బహిరంగ సమావేశంలో నటుడు రాధారవి మాట్లాడారు. ఆ సమయంలో ఆయన తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తేనాంపేటలో గల రాధారవి ఇంటిని ముట్టడించి పోరాటం చేస్తామని దివ్యాంగుల సంఘ అధ్యక్షుడు రాధాకృష్ణన్ ప్రకటించాడు. దీంతో రాధారవి ఇంటి ముందు పోలీసులు మోహరించారు. దీనిపై రాధారవి మాట్లాడుతూ తాను దివ్యాంగుల మనసు బాధించేలా మాట్లాడలేదని తెలిపారు.
కనిమొళి ఖండన
రాధారవి మాటలను డీఎంకే మహిళా విభాగ కార్యదర్శి కనిమొళి తీవ్రంగా ఖండించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ దివ్యాంగులను కించపరిచి వారి మనసులు బాధించే విధంగా రాధారవి మాట్లాడడం తనను ఆవేదనకు గురి చేసిందన్నారు. ఇకనైనా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని హితవు చెప్పారు.