మూడు షిప్టులు... రెండు బ్యాచ్‌లు
విధి నిర్వహణలో పోలీసులు సతమతం
అమరావతి (తాడికొండ) : అమరావతి మండలం వైకుంఠపురంలోని పుష్కరఘాట్‌లో విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పరిస్థితి దయనీయంగా మారింది. అర్బన్ పరిధిలో రోజుకు మూడు షిప్టులకు మూడు బ్యాచ్‌లుగా విభజించి ఘాట్లలో విధులు నిర్వహిస్తున్నారు. రూరల్ పరిధిలోని అన్ని ఘాట్లలో మాత్రం మూడు షిప్టులుగా విభజించారు కానీ రెండు బ్యాచ్‌లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నాయి. దీంతో ప్రతిరోజూ ఒక కానిస్టేబుల్ 12 గంటలు విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. పొరపాటున ఏదైనా సంఘటన జరిగితే ఇబ్బంది పడతామన్న ఆందోళనతో విధులు నిర్వహిస్తున్నారు. 12 గంటల విధి నిర్వహణతో అసౌకర్యానికి గురవుతున్నామని కొందరు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 7వ తేదీ నుంచి పుష్కర విధులకు హాజరయ్యామని, నేటివరకు ఇంటిముఖం చూడలేదని పలువురు సిబ్బంది వాపోతున్నారు. కేవలం రూరల్ పరిధిలోని పోలీసులకే ఈ పరిస్థితి నెలకొందన్నారు. మరో వారం పాటు పుష్కర విధులు నిర్వహించాల్సి ఉందని, 12 గంటల డ్యూటీ చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. ఇప్పటినుంచైనా 3 షిప్టులకు మూడు బ్యాచ్‌లను విభజించి 8 గంటల డ్యూటీ అమలు చేయాలని కోరుతున్నారు.