జనానికి చేరువవుతా బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్పీ తరుణ్‌జోషి
సాక్షి, నిజామాబాద్ : పోలీసు సేవలను సామాన్యులకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తానని నూతన ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషి పేర్కొన్నారు. గురువారం రాత్రి 10:30కు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముహూర్తం చూసుకుని సంతకం చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, నేరాల నియంత్రణపై దృష్టి సారిస్తానన్నారు. జిల్లాలో రాజకీయ ఒత్తిళ్ల విషయమై విలేకరులు ప్రస్తావించగా, ‘ కడప జిల్లాలో పనిచేశాను.. ఎలా చేయాలో తెలుసు..’ అని పేర్కొన్నారు. అంతకుముందు డీఎస్ పీ అనీల్‌కుమార్, వన్‌టౌన్ ఎస్హెచ్ఓ యాదయ్య, రూరల్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్హెచ్ఓ సోమనాథం, ట్రాఫిక్ సీఐ శ్రీధర్‌కుమార్, ఎస్బీఐ ఆంజనేయులు, ఆర్ఐ మల్లికార్జున్, టూటౌన్ ఎస్ఐ ఆసిఫ్, నాలుగోటౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ తదితరులు పుష్పగుచ్ఛాలిచ్చి తరుణ్‌జోషికి స్వాగతం పలికా రు.
తరుణ్‌జోషి స్వస్థలం న్యూఢిల్లీ. బీడీఎస్ చదివిన ఆయన పోలీస్ మేనేజ్మెంట్ కోర్సులో మాస్టర్ డిగ్రీ చేశారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని, ఆదిలాబాద్ ఏఎస్పీ గా, వరంగల్ ఓఎస్డిగా, విశాఖపట్నం డీసీపీ (లా అండ్ ఆర్డర్), వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీగా, విశాఖపట్నంలో గ్రేహౌండ్స్ విభాగంలో పనిచేశారు. హైదరాబాద్ నగ రం సెంట్రల్‌జోన్ డీసీగా కూడా విధులు నిర్వర్తించారు. సౌత్‌జోన్ డీసీపీగా పనిచేసి బదిలీపై జిల్లాకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించాక మర్యాద పూర్వకంగా డీఐజీ అనీల్‌కుమార్‌ను కలుసుకున్నారు.