‘గ్యాంగ్ రేప్’లపై విచారణ
జాట్ల ఆందోళన సమయంలో జరిగిన అఘాయిత్యాలను చూశామని కొందరి వెల్లడి
చండీగఢ్: జాట్ల ఉద్యమ సమయంలో సామూహిక అత్యాచారాల ఆరోపణలపై ఏర్పాటైన కమిటీ శనివారం విచారణ ప్రారంభించింది. హరియాణా డీఐజీ రాజశ్రీ సింగ్ నేతృత్వంలోని ఇద్దరు మహిళా డీఎస్పీల బృందం సోనెపట్ జిల్లా ముర్తాల్ ప్రాంతంలో పర్యటించింది. ప్రత్యక్షసాక్షులు, బాధితులు తమను సంప్రదించలేదని కమిటీ చెప్పగా... మహిళలపై అల్లరిమూక దాడి చేయడం చూశామంటూ ముగ్గురు లారీ డ్రైవర్లు మీడియాకు వెల్లడించారు. ‘ఆ దృశ్యాల్ని చూశాను.
మహిళలు, అమ్మాయిలపై అల్లరిమూక దాడి చేసి బట్టలు చించేశారు. పొలాల్లోకి పారిపోతుండగా వారిని వెంబడించారు. కొందర్ని బలవంతంగా లాక్కెళ్లారు’ అని నిరంజన్సింగ్ వివరించాడు. నోరువిప్పవద్దంటూ తమపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని సుఖ్విందర్ అనే డ్రైవర్ ఆరోపించాడు. దర్యాప్తులో దొరికిన దుస్తుల్ని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని డీఐజీ తెలిపారు. జాట్ల ఆందోళన సమయంలో 10 మంది మహిళలపై 40 మంది గుంపు లైంగిక దాడికి పాల్పడ్డారని, ముర్తాల్లో మహిళల బట్టలు, లోదుస్తులు దొరికాయన్న వార్తలొచ్చాయి. విచారణకు జాతీయ మహిళా కమిషన్ సభ్యుల బృందం ముర్తాల్ వెళ్లనుందని కేంద్రం తెలిపింది.