డీఐజీ వచ్చారు
బాధ్యతల స్వీకరణ
శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం
జిల్లాకు పాతవాడినే
నూతన డీఐజీ సూర్యనారాయణ
నిజామాబాద్క్రైం, న్యూస్‌లైన్ :
రేంజ్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని నిజామాబాద్ డీఐజీ సూర్యనారాయణ పేర్కొన్నారు. సాధారణ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. ఆయన సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో నిజామాబాద్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం నిజామాబాద్ వచ్చారు. ఆయనకు జిల్లా పోలీసు అధికారులు ఘన స్వాగతం పలికారు. గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ఈసారి జరగబోయే ఎన్నికలు ముఖ్యమైనవన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా విధులు నిర్వహిస్తామని, అందుకు తగిన ప్రణాళికతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
2009లో జిల్లా ఎస్పీగా పని చేశానని, జిల్లా గురించి తెలుసునని డీఐజీ అన్నారు. రేంజ్ పరిధిలోని మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, నేరాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ తరుణ్‌జోషి, ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్ డీఐజీని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితులను వారు డీఐజీకి వివరించారు. అడిషనల్ ఎస్పీ పాండునాయక్, నిజామాబాద్ నగర సీఐ సైదులు, నగర ఎస్హెచ్ఓ నర్సిం గ్యాదవ్, రూరల్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్‌రెడ్డి, నగర 3, 4 టౌన్ల ఎస్ఐలు శ్రీహరి, నరేశ్ తదితరులు డీఐజీకి స్వాగతం పలికినవారిలో ఉన్నారు.