డిజిటల్ శకానికి ఎస్బీఐ నాంది
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డిజిటల్ యుగానికి శ్రీకారం చుట్టింది. కొత్త తరం బ్యాంకింగ్ సేవలను కల్పించేందుకు బ్యాంక్ డిజిటల్ బ్రాంచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాంక్ 60వ వ్యవస్థాపక దినోత్సవమైన మంగళవారంనాడు ఆరు నగరాల్లో ఈ ‘ఎస్బీఐ ఇన్టచ్’ శాఖలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు.
ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్‌లలో బ్రాంచ్‌లు మొదలవగా... కోల్‌కతా శాఖ త్వరలోనే తెరచుకోనుంది. క్షణాల్లో(ఇన్‌స్టంట్‌గా) బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా(పర్సనలైజ్డ్) డెబిట్ కార్డుల జారీ వంటి సేవలు ఈ డిజిటల్ స్టోర్(బ్రాంచ్)లలో లభ్యమవుతాయి. వారానికి ఏడు రోజులూ ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకూ ఇవి పనిచేస్తాయి. వినూత్న సాంకేతిక పరిజ్ఞానం, కస్టమర్లకు మెరుగైన సేవలందించే ఫీచర్లతో భారతీయ బ్యాంకింగ్ పరిశ్రమలో డిజిటల్ శకానికి ఎస్బీఐ బాటలువేసిందని జైట్లీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
రానున్నకాలంలో బ్యాంకింగ్ వ్యయాలు బ్రాంచీల్లో కస్టమర్లు గడిపే సమాయాన్ని వీలైనంతవరకూ తగ్గించేందుకు ఈ కొత్తతరం శాఖలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఇతర బ్యాంకులు కూడా ఇదేవిధమైన డిజిటల్ బ్రాంచ్‌ల దిశగా అడుగులు వేస్తాయన్న ఆశాభావాన్ని జైట్లీ వ్యక్తం చేశారు. ఇన్‌స్టంట్‌గా పర్సనలైజ్డ్ డెబిట్‌కార్డుల జారీతోపాటు ఇక్కడున్న ఏటీఎం మెషీన్లలో క్యాష్ డిపాజిట్ వంటి సదుపాయాలు కూడా ఉంటాయని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య చెప్పారు. తమ గ్రూప్ కంపెనీలకు చెందిన బీమా, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ కార్డులు ఇతరత్రా ఉత్పత్తులు, సేవలన్నీ కూడా ఇక్కడ లభిస్తాయని వెల్లడించారు. ఐటీ, కన్సల్టెన్సీ దిగ్గజం యాక్సెంచర్ ఈ డిజిటల్ బ్రాంచ్‌లకు సాంకేతిక తోడ్పాటుతోపాటు ఉద్యోగులకు తగిన శిక్షణ కూడా అందించింది.
మొండి బకాయిల తగ్గింపునకు మంత్ర దండం లేదు: అరుంధతీ
మొండి బకాయిల బరువును తగ్గించడానికి తన వద్ద మంత్రదండం ఏదీ లేదని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి నెల మార్చి ముగిసే సరికి బ్యాంక్ మొండి బకాయిలు రూ.61,605 కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆర్థికాభివృద్ధి ఊపందుకుంటుందన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేస్తూ, దీనివల్ల మొండి బకాయిల సమస్య పరిష్కారమవుతుందన్నారు. వడ్డీరేట్లు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయని పేర్కొంటూ... మరికొంతకాలంపాటు పెద్దగా మార్పు ఉండకపోవచ్చని సూచించారు. నిధుల సమీకరణ ప్రణాళికల గురించి ఆమె వివరిస్తూ, ప్రస్తుతానికి ఈ అవసరం ఏదీ లేదన్నారు.
ద్రవ్యలోటుపై అప్పుడే చెప్పలేం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో (2014-15, ఏప్రిల్-మే) రూ. 2.4 లక్షల కోట్ల ద్రవ్యలోటు (ఫిబ్రవరి బడ్జెట్ అంచనాల్లో 45.6 శాతం) గణాంకాలను కూడా ఆమె ప్రస్తావించారు. స్వల్పకాలిక సమయం ప్రాతిపదికన దీనిపై ఒక అంచనాలకు రాలేమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదిలావుండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 4.4 శాతంగా ఉంటుందని ఎస్బీఐ ఆర్థిక పరిశోధనా శాఖ విడుదల చేసిన ఒక నివేదిక పేర్కొంది.
5,000కు పైగా ఎస్బీఐ కొత్త ఏటీఎంలు
ముంబై: ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 5,000 ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు ఎస్బీఐ ఎండీ (నేషనల్ బ్యాంకింగ్) ఏ. కృష్ణకుమార్ మంగళవారం ఇక్కడ చెప్పారు. వీటితో పాటు ఈ ఏడాది 1,000 కొత్త బ్యాంక్ శాఖలను ఏర్పాటు చేయనున్నామని, అలాగే పాయింట్ ఆఫ్ సేల్స్ మెషీన్ల నెట్వర్క్ విస్తరణపై దృష్టి పెట్టామనికూడా ఆయన పేర్కొన్నారు.