అమ్మకు ప్రేమతో....
బెంగళూరు: కరవు కాటకాలతో అల్లాడిపోతున్న ఈ దేశంలో గుక్కెడు మంచినీళ్ల కోసం మన తల్లులు, చెల్లెళ్లు బిందెలు భుజానెత్తుకొని కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కాలినడకన వెళ్లి రావాల్సి వస్తున్న విషయం తెల్సిందే. ఆ మధ్య ఓ చెల్లెలు మహారాష్ట్రలో నీళ్ల కోసం ఎర్రటి ఎండలో వెళ్లి గుండెపోటుతో మరణించిన విషాదాంతం కూడా కదిలించింది. తాజాగా కర్ణాటకలోని సెట్టిసార గ్రామానికి చెందిన పవన్ కుమార్ అనే 17 ఏళ్ల యువకుడు అందరి తల్లులలాగే తన తల్లి నీళ్ల కోసం ఎంతోదూరం వెళ్లి కష్టపడడం చూసి కదలిపోయాడు.
ఎలాగైనా తన తల్లికి ఈ తిప్పలు తప్పించాలనుకున్నాడు. ఇంటి వెనక పెరట్లో బావిని తవ్విస్తే బాగుంటుందని భావించాడు. అందుకు ఇంటి ఆర్థిక స్థోమత సరిపోదు. తల్లి ఓ ప్రింటింగ్ ప్రెస్లో, తండ్రి వంటవాడిగా పనిచేస్తున్నా వారికొచ్చే జీతం ఇంటి ఖర్చులకే సరిపోతోంది. మరి బావిని తవ్వడం ఎలా? అని పవన్ కుమార్ ఆలోచించాడు. బీహార్లో దశరథ్ రామ్ మాంఝీ అనే దళితుడు గ్రామం రోడ్డు కోసం 22 ఏళ్లపాడు ఓ కొండను తవ్వి రోడ్డేసిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. అంతే, తన ఇంట్లో బావిని తానే తవ్వాలనుకున్నాడు.
ఫిబ్రవరి 26వ తేదీన పవన్ కుమార్ తమ ఇంటి వెనక పెరట్లో బావిని తవ్వడం ప్రారంభించారు. రేయనక, పగలనక అవిశ్రాంతంగా తవ్వుతూ వెళ్లగా అదష్టవశాత్తు 53 అడుగుల వద్దనే బావిలో నీరు పడింది. మరో రెండడుగులు బావిని తవ్వి పని ముగించాడు. మధ్యలో పీయూ పరీక్షల కోసం పది రోజుల పాటు బావి తవ్వక పనులను పక్కన పెట్టాడు. మొత్తంగా 45 రోజులు పనిచేసి బావిని తవ్వానని, తన తల్లికి మంచినీళ్ల కష్టాలను తొలగించినందుకు తనకెంతో ఆనందంగా ఉందని తనను కలసుకున్న మీడియాతో పవన్ కుమార్ వ్యాఖ్యానించాడు.