మనసుతో చూశాను!
లైఫ్ బుక్
అమ్మా, నాన్నలతో పాటు లండన్లో ఉన్నప్పటికీ బాలీవుడ్ సినిమాలు అంటే పడి చచ్చేదాన్ని. టీవీలో పాటలు చూస్తూ నృత్యం చేసేదాన్ని. అలా సినిమా అంటే ఇష్టం పెరిగింది.
ఉన్నత చదువులు చదివిన పిల్లలు సినిమాల వైపు మొగ్గు చూపడం తల్లిదండ్రులకు పెద్దగా ఇష్టం ఉండదు. చదువుల్లో ముందున్నప్పటికీ, క్రిమినల్ సైకాలజీలో డిగ్రీ ఉన్నప్పటికీ ‘సినిమాల్లోకి వెళతాను’ అని నేను అడిగినప్పుడు నా తల్లిదండ్రులు ఎప్పుడూ కాదనలేదు.
‘సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు తలబిరుసు సమాధానాలు వినిపిస్తాయి. అవమానించే రీతిలో కామెంట్లు వినిపిస్తాయి...’ ఇలా ఎన్నో చెప్పారు సన్నిహితులు. నేనైతే వీటి గురించి పట్టించుకోకుండా సినిమాల్లో నటించాలనే ఏకైక లక్ష్యంతో ముంబయిలో వాలిపోయాను.
సినిమాల్లో నటించడానికి ఇండియాకు వచ్చినప్పటికీ, నా మూలాలను దగ్గరి నుంచి చూసే అవకాశం, అదృష్టం నాకు కలిగాయి. ఇండియాను నేను కళ్లతో కాదు మనసుతో చూశాను. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు తల్లి దగ్గరికి వచ్చినట్లు అనిపించింది.
తొలిచిత్రం ‘దిల్ దియా హై’ బాగా ఆడలేదు. అయితే నా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. పాలగ్లాసు కింద పడితే...దాన్ని చూస్తూ బాధపడే రకం కాదు నేను. మరో పాలగ్లాసు గురించి ఆలోచిస్తాను. నా మొదటి సినిమా పరాజయానికి నేను బాధ పడలేదు. ‘తరువాత ఏమిటి?’ అని మాత్రమే ఆలోచించాను. కష్టపడేతత్వం, మన శక్తి మీద మనకు నమ్మకం ఉంటే మంచి ఫలితం ఎప్పటికైనా వస్తుందని గాఢంగా నమ్ముతాను నేను.
జీవితంలో అనేక అనుభవాలను చవి చూశారు నా తల్లిదండ్రులు. ఎన్నో కష్టాలను దాటుకొని వచ్చారు. వారి అనుభవాలు నాకు కొత్త శక్తిని ఇస్తాయి. గెలుపు కోసం ఎదురు చూసే ఓపికను ఇస్తాయి.
- గీతా బస్రా, హీరోయిన్, జిల్లా ఘజియాబాద్ చిత్రం ఫేమ్