తుంగభద్ర అంటే చాలా ఇష్టం : రాజమౌళి
‘‘నాకు, నా కుటుంబ సభ్యులకు తుంగభద్ర అంటే ఇష్టం. మేం అక్కణ్ణుంచి వచ్చినవాళ్లమే. అదే టైటిల్‌తో సాయి కొర్రపాటి ఈ చిత్రం నిర్మించడం ఆనందంగా ఉంది. మంచి ట్విస్ట్‌తో సాగే సినిమా ఇది. శ్రీనివాస కృష్ణ అద్భుతంగా తెరకెక్కించాడు. క్లయిమాక్స్ చాలా అద్భుతంగా ఉంది. హరి గౌర మంచి పాటలిచ్చారు’’ అని దర్శకుడు రాజమౌళి చెప్పారు. అదిత్, డింపుల్ చోపడే జంటగా సాయి శివాని సమర్పణలో సాయి కొర్రపాటి ప్రొడక్షన్స్‌పై రజనీ కొర్రపాటి నిర్మించిన చిత్రం ‘తుంగభద్ర’. శ్రీనివాసకృష్ణ గోగినేని దర్శకుడు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న హీరోలు నాని, నాగశౌర్య సీడీలను ఆవిష్కరించారు.
ప్రచార చిత్రాన్ని రాజమౌళి విడుదల చేశారు. పాటలన్నీ చాలా బాగున్నాయనీ, కొత్తవారికి అవకాశం ఇవ్వడం ద్వారా సాయిగారికి ఎంతో పుణ్యం దక్కుతోందని కీరవాణి అన్నారు. ఈ చిత్రానికి సాహితి, చైతన్య ప్రసాద్ రెండు పాటలు రాయగా, తన తల్లి రెండు పాటలు రాశారని సంగీతదర్శకుడు తెలిపారు. మంచి చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉందని డింపుల్, అదిత్ తెలిపారు. ఈ వేడుకలో బీవీయస్‌యన్ ప్రసాద్, లగడపాటి శ్రీధర్, అంబికా కృష్ణ, వందేమాతరం శ్రీనివాస్, కల్యాణ్ కోడూరి తదితరులు పాల్గొన్నారు.