ఇది చాలా తీవ్రమైన చర్య..ఎవరు బందీలుగా లేరు..
పంజాబ్: పంజాబ్ దినాన్ పూర్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు దాడి చాలా తీవ్రమైన చర్యగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిరణ్ రిజుజు అభివర్ణించారు. అయితే పోలీస్ స్టేషన్ లోపలికి చొరబడి కాల్పులు జరుపుతున్న ఉగ్రవాదులు ఎవరినీ బంధించినట్టు తమకు సమాచారం లేదన్నారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం కోసం చూస్తున్నామని రిజుజు తెలిపారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నందున ఇంతకుమించి ఈ ఘటనపై వివరాలను ప్రకటించలేమన్నారు. అన్ని రక్షణ దళాలను అప్రమత్తం చేశామని, దినాన్ పూర్ ప్రాంతంలోని పరిస్థితిని సమీక్షించేందుకు ఎన్ఎస్జీ కమాండర్లు, సైన్యం దిగనుందని ప్రకటించారు.
ఐబీ హెచ్చరించినట్టుగానే ఉగ్రవాదులు పంజాబ్‌లోని గురుదాస్ పూర్ పోలీస్ స్టేషన్లోకి చొరబడి విచక్షణా రహితంగా తెగబడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఈ భీకర ఘటనపై కేంద్ర ప్రభుత్వం, రక్షణ వర్గాలు స్పందించాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు, దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
మరోవైపు సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన ఉగ్రవాదులు అయిదుగురిని పొట్టనపెట్టుకున్నారు. వీరి వారి సంఖ్య పెరుగే అవకాశం ఉందని తెలుస్తొంది. దాడులకు పాల్పడింది ఉగ్రవాదులేనని హోం శాఖ నిర్ధారించింది.