Dinesh Vision
-
అయ్యో పాపం... గాయం!
అదో పెద్ద కోట. ఆ కోట గోడపై పరిగెత్తడం అంటే సాహసం చేయడమే. కండల వీరుల గుండెలు దడదడలాడి పోతాయ్. ఇక, గులాబీ బాల కృతీ సనన్ వంటి భామలైతే వణికిపోతారు. ఆ వణుకుతో పరిగెత్తితే జారడం ఖాయం. అదే జరిగింది. కృతీ సనన్ ఎవరో ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు. మహేశ్‌బాబుతో ‘నేనొక్కడినే’, నాగచైతన్యతో ‘దోచెయ్’ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత హిందీ సినిమాలకు పరిమితమయ్యారు. ప్రస్తుతం దినేశ్ విజన్ దర్శకత్వం వహిస్తున్న ‘రాబ్తా’ చిత్రంలో సుషాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో జతకట్టారామె. ఈ చిత్రం షూటింగ్ హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరుగుతోంది. ఓ కోట గోడపై కృతి పరిగెత్తే సన్నివేశం తీయడానికి ప్లాన్ చేశారు. సీన్ విన్న కృతి భయపడినా, ‘చేయను’ అంటే బాగుండదు కదా... ఒప్పేసుకున్నారు. డెరైక్టర్ షాట్ రెడీ అనగానే, మనసులో భయాన్ని బయటికి కనిపించనివ్వకుండా గోడపై పరిగెత్తసాగారామె. హఠాత్తుగా కృతి పరుగుకి బ్రేక్ పడింది. కాలు జారిందట. అయితే గోడ పైనుంచి పూర్తిగా కిందపడకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కానీ, నొప్పితో కృతి విలవిలలాడిపోయారట. పెద్ద గాయం కాకపోయినా, కాలు బెణికినందువల్ల రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారట. -
ఇప్పుడు భయం పోయింది!
నీళ్లల్లోకి దిగడం అంటే మన ‘1’ హీరోయిన్ కృతీ సనన్‌కి ప్రాణం పోయినంత పని అవుతుందట. పాపం... అందుకే ఈత కూడా నేర్చుకోలేకపోయారు. ఇన్నేళ్లూ ఈత కొట్టాల్సిన అవసరం రాకపోవడంతో కృతీకి ఇబ్బంది కలగలేదు. కానీ, ఇప్పుడు మాత్రం పెద్ద ఇబ్బందే ఎదురయ్యింది. హిందీలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన ఆమె నటిస్తున్న చిత్రం ‘రాబ్తా’. ఈ చిత్రం కోసం కృతీ సనన్ ఈత కొట్టాలన్న మాట. చిత్రదర్శకుడు దినేష్ విజన్ ఈ విషయం గురించి చెప్పగానే, ఈ బ్యూటీ భయపడిపోయారు. కానీ, చేయనంటే బాగుండదు కదా! అందుకని భయాన్ని పక్కన పెట్టి, ఈత నేర్చుకోవడం మొదలుపెట్టారామె. ప్రతిరోజూ ఉదయం దాదాపు గంట సేపు ఈత నేర్చుకున్నారు. ఆ విషయం గురించి కృతీ సనన్ చెబుతూ- ‘‘ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టాక భయం పోయింది. మొదటి రోజు బాగా భయపడిపోయాను. రెండో రోజుకి కాస్త భయం తగ్గింది. మూడో రోజు ఇంకాస్త! ఇలా రోజు రోజుకీ కొంచెం కొంచెంగా భయం తగ్గిపోయింది. ఇప్పుడు ఈత కొలనులో దిగడం నాకు చాలా ఈజీ’’ అని తెలిపారు. ఒకప్పుడు ఈత కొట్టడం భయం అని చెప్పుకుంటూ వచ్చిన కృతి ఇప్పుడు ‘నాకా..? భయమా...’ అని ధీమాగా అంటున్నారు. కాగా, ఈ చిత్రం కోసం ఈత కొట్టడమే కాదు... గుర్రపు స్వారీ కూడా కృతీసనన్ నేర్చుకున్నారు. మొత్తం మీద ఈ సినిమా తనకో సవాల్ అంటున్నారామె.