వజ్రాల వేటకు పోదాం చలో చలో..
వజ్రకరూరు పరిసరపొలాల్లో గుంపులుగా వెతుకులాట
ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వెతుకుతున్న జనం
పోటాపోటీగా పాల్గొంటున్న మహిళలు
భోజన క్యారియర్లతో వెళ్లి గాలింపు
ఇటీవల వజ్రకరూరులో భారీ వర్షం
వజ్రకరూరు: మండల కేంద్రం వజ్రకరూరు పరిసర ప్రాంతంలో వజ్రాల కోసం వేట కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం జూన్ మాసంలో తొలకరి వర్షాలు పడిన వెంటనే వజ్రాల కోసం వెతుకులాట ప్రారంభించడం జరుగుతుంటుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడ వర్షాలు ప్రారంభం కావడంతో కొద్దిరోజుల క్రితం వజ్రాల కోసం వెతుకులాట మొదలైంది. మండల వాసులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేకమంది ఇక్కడకు వచ్చి వజ్రాల కోసం వెతుకుతున్నారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం వజ్రకరూరులో భారీ వర్షం కురిసింది. దీంతో చుట్టు పక్కల పొలాల్లో వర్షపు నీరు ప్రవహించింది.
ఈ క్రమంలోనే వందలమంది పొలాల వద్దకు చేరుకొని వజ్రాల వేటను వేగవంతం చేశారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అనేకమంది గుంపులు, గుంపులుగా ఏర్పడి వజ్రాల కోసం వెతుకున్నారు. ప్రతి రోజు ఉదయాన్నే పొలాలకు చేరుకుని సాయంత్రం వరకు వజ్రాలను వెతుకున్నారు. పురుషులతోపాటు మహిళలు కూడ ఈ పనిలో పడ్డారు. కొద్దిరోజుల క్రితం లక్ష రూపాయలు విలువచేసే రెండు వజ్రాలు లభించినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో లభించే వజ్రాలు కోహినూర్ వజ్రంతో సమానమని చెబుతుంటారు.
పైగా ఇక్కడ లభించే వజ్రాలను గుట్టు చప్పుడు కాకుండా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా వర్షాలు ప్రారంభం కావడంతో ఇతర ప్రాంతాలకు చెందిన అనేకమంది వజ్రాల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఒక్క వజ్రం దొరికితే తమ కష్టాలు తీరుతాయని అనేకమంది ఎంతో ఆశతో ఇక్కడకు వస్తుండటం విశేషం. భోజనాలు తీసుకొని వెళ్లి మరీ వజ్రాలకు వెతికేందుకు వెళుతున్నారు.