నాణ్యమైన విత్తనాలను అందించాలి
నూనెపల్లె: కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేలా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన స్థానం డెరైక్టర్ డాక్టర్ రాజారెడ్డి పేర్కొన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాకు చెందిన వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు, రైతులతో జెడ్‌ఆర్‌ఈఏసీ(మండల పరిశోధన, సలహా మండలి) సమావేశం సోమవారం నూనెపల్లె వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో ఏడీఆర్ డాక్టర్ పద్మలత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో అన్ని రకాల పంటలు సాగుచేసేందుకు అనువైన భూములు ఉన్నాయన్నారు. అయితే సీమ రైతుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని మరిన్ని పరిశోధనలు సాగించాలన్నారు.
రాష్ట్రంలోని 13 జిల్లాల రైతుల కంటే కర్నూలు, అనంతపురం జిల్లాల అన్నదాతలు ముందంజలో ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. ప్రతి ఏడాది ఆర్ఈసీ కమిటీ ఎంపికలో సీమ ప్రాంతానికి చెందిన రైతులు ఎంపిక కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు శాస్త్రవేత్తలు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అందుకు అవసరమైన శిక్షణ ఇస్తూ పరిశోధనల్లో భాగస్వాములను చేసుకోవాలన్నారు.
సీమ ప్రాంతంలో మహిళా రైతులు, శాస్త్రవేత్తలు కనిపించకపోవడం బాధాకరంగా ఉందని పురుషుల కంటే అధికంగా మహిళలను ప్రోత్సహించాలని అన్నారు. కర్నూలు, కడప, గుంటూరులోని ప్రధాన రహదారిలో నంద్యాల పరిశోధన స్థానం ఉన్నందున విత్తనాలు విక్రయ కేంద్రాన్ని స్థానికంగా ఏర్పాటు చేయాలని సూచించారు.
దీంతో పరిశోధన స్థానానికి ఆదాయం చేకూరడంతో పాటు రైతులకు నాణ్యమైన విత్తనాలను అందివ్వవచ్చన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సాగులో ఉన్న పొలాలను, యాంత్రీకరణ పద్ధతులు పరిశోధనల వివరాలను ఏడీఆర్ డాక్టర్ పద్మలత వివరించారు. కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన జేడీఏలు రైతులకు అందిస్తున్న ప్రభుత్వ పథకాలను స్లైడ్స్ ద్వారా సమావేశంలో వివరించారు.
అనంతరం నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌లో శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనలను బ్రోచర్‌ను అతిథులు ఆవిష్కరించారు. సమావేశంలో మహానంది అగ్రికల్చర్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రవీంద్రనాథ్‌రెడ్డి, కర్నూలు జేడీఏ ఠాగూర్ నాయక్, అనంతపురం జేడీఏ శ్రీరామమ్మూరి, బొజ్జా అగ్రికల్చర్ ఫౌండేషన్ చైర్మన్ బొజ్జా దశరథ రామిరెడ్డి, హైదరాబాద్‌కు చెందిన అసోసియేషన్ మేనేజ్ డాక్టర్ లక్ష్మిమనోహరి, కర్నూలు, అనంతపురం ప్రాంతాలకు చెందిన శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.