మహాసంకల్ప సభకు 150 బస్సులు : జేసీ
కాకినాడ సిటీ : గుంటూరు జిల్లా నాగార్జునసాగర్‌లో ప్రభుత్వం నిర్వహిస్తున్న మహాసంకల్ప దినోత్సవ సభా కార్యక్రమానికి జిల్లా నుంచి ఆసక్తి ఉన్న ప్రజలు తరలి వెళ్లేందుకు 150 బస్సులు ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ రాముడు, ప్రభుత్వ సలహాదారుడు పరకాల ప్రభాకర్ సంయుక్తంగా వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారం గుంటూరు జిల్లాలో నిర్వహించనున్న ఈ సభను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేసే చర్యలపై ఆదేశాలు జారీ చేశారు.
ఈ వీడియోకాన్పరెన్స్‌లో జిల్లా నుంచి పాల్గొన్న జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నుంచి సుమారు ఏడు వేల నుంచి పది వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని వివరించారు. వీరికోసం మండలానికి రెండు, మున్సిపాలిటీకి రెండు చొప్పున 150 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అలాగే సభకు తరలి వెళ్లే ప్రజలకు మధ్యాహ్న భోజనం, తాగునీరు వంటి సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పర్యవేక్షించేందుకు లైజన్ అధికారులను ప్రత్యేకంగా నియమించామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్-2 డి.మార్కండేయులు, సీపీఓ విజయలక్ష్మి, డ్వామా పీడీ నాగేశ్వరరావు, డీఎస్ఓ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
జిల్లా నుంచి 26 వేల మంది : డిప్యూటీ సీఎం
పెద్దాపురం : గుంటూరు జిల్లాలో సోమవారం జరిగే మహాసంకల్ప దీక్షకు జిల్లా నుంచి 26 వేల మంది వివిధ వాహనాల్లో తరలివెళ్లినట్టు డిప్యూటీ సీఎం, హోంశాఖమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి ఏడాదైన సందర్భంగా ప్రభుత్వం మహాసంకల్ప దీక్ష ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి ఈ సంకల్పదీక్షకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చినట్టు ఆయన తెలిపారు.