విదేశీ వాణిజ్య నిబంధనల సరళీకరణ
సాక్షి ప్రతినిధి, కాకినాడ : దేశంలోని అన్ని ఓడరేవుల్లో ఎగుమతులు, దిగుమతులను ప్రోత్సహించడానికి విదేశీ వాణిజ్య నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సరళీకరించిందని విదేశీ వాణిజ్యం జాయింట్ డెరైక్టర్ జనరల్ జి.సీతారామరెడ్డి చెప్పారు. ఈ వాణిజ్యానికి అవసరమైన అన్ని అనుమతులూ ఇకపై ఆన్లైన్లోనే పొందవచ్చన్నారు. సరుకుల ఎగుమతి, దిగుమతిదారులను ప్రోత్సహించే లక్ష్యంతో కస్టమ్స్ నిబంధనలను మారుస్తూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నిర్యత్ బంధు’ విధానంపై.. ఔత్సాహిక వ్యాపారులకు అవగాహన కల్పించేందుకు కాకినాడ కస్టమ్స్ హౌస్‌లో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీతారామరెడ్డి మాట్లాడుతూ, పేపర్‌లెస్ విధానం ఔత్సాహిక వాణిజ్యవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ విదేశాల నుంచి వచ్చే సరకులను తనిఖీ చేసే పాత్ర మాత్రమే నిర్వహిస్తున్న కస్టమ్స్ ఇన్స్పెక్టర్లు.. ఇప్పుడు ఎగుమతి, దిగుమతిదారులకు ప్రోత్సాహం కల్పించే బాధ్యతను తీసుకున్నారని చెప్పారు. కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ ఎం.శ్రీకాంత్, అసిస్టెంట్ కమిషనర్ వి.శ్రీనివాసరావులు మాట్లాడుతూ, హోప్ ఐలాండ్ సహజ రక్షణ కవచంలా ఉన్న కాకినాడ రేవు ఎగుమతులు, దిగుమతుల్లో పూర్వ వైభవం సాధిస్తుందనడంలో సందేహం లేదన్నారు. విదేశీ వాణిజ్యంలో ప్రవేశించాలనుకునే ఔత్సాహికులు ఆన్లైన్లో పూర్తి చేయాల్సిన దరఖాస్తులపై అసిస్టెంట్ కమిషనర్ పున్నమ్కుమార్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
కాకినాడ సీపోర్టు జనరల్ మేనేజర్ ఎం.జాకబ్ మాట్లాడుతూ, ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, కొన్ని సంపన్న దేశాలు ఆర్థికమాంద్యంతో సతమతమవుతున్నా.. ఈ ఏడాది 15.5 మిలియన్ టన్నుల కార్గో లక్ష్యాన్ని సాధించామని వివరించారు. కాకినాడ రేవు ద్వారా గత మూడేళ్లలో ఎగుమతులు, దిగుమతుల్లో 80 శాతం వృద్ధి సాధించామన్నారు. ఓఎన్జీసీ, రిలయన్స్, జీఎస్పీసీ, ట్రాన్సోసియాన్, కెయిర్న్ వంటి సంస్థలు పెట్రోలియం, సహజవాయువు వెలికితీత కార్యకలాపాలను కాకినాడ సమీపాన నిర్వహించడం కూడా దీనికి ప్రధాన కారణమన్నారు.
ఎరువులు, బొగ్గు, అల్యూమినియం వంటివాటిని యాంత్రీకరణ విధానంలో రవాణా చేసే సౌకర్యాలు కాకినాడ పోర్టులో ఉన్నాయని చెప్పారు. పెద్ద నౌకలకు సర్వీసింగ్ సదుపాయం కూడా ఉందన్నారు. త్వరలో మరో బెర్తు సిద్ధమవుతోందని వివరించారు. కాకినాడ కంటైనర్ టెర్మినల్ లిమిటెడ్ మేనేజర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రాష్ట్ర నూతన రాజధాని అమరావతికి విశాఖకన్నా కాకినాడ రేవు సమీపాన ఉందని, భవిష్యత్తులో ఇక్కడినుంచే విదేశీ వర్తకం ఎక్కువగా జరిగే అవకాశం ఉందని వివరించారు. తమ సంస్థ కూడా రెండు బెర్తులను సిద్ధం చేస్తోందని తెలిపారు. కాకినాడ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ దంటు సూర్యారావు కూడా మాట్లాడారు.