హీరో శివాజీపై దర్శకుడి ఆరోపణలు
సినీ నటుడు శివాజీపై ‘బూచమ్మా బూచోడు’ దర్శకుడు రేవన్ యాదు మీడియా ఎక్కారు. సినిమా ప్రచారంలో తనను పక్కనపెట్టారని ఆరోపించారు. ప్రమోషన్ బాధ్యతలు భుజన వేసుకున్న హీరో శివాజీ తనను కావాలనే పట్టించుకోవడం లేదని వాపోయాడు. ప్రమోషన్ లో తనను ఎందుకు విస్మరించారని ప్రశ్నించాడు. డైరెక్టర్ ను కెప్టెన్ అంటారని, మరి తన స్థానం ఎక్కడని నిలదీశాడు. తన సినిమాను తాను దర్శకత్వం వహించానని చెప్పుకోలేని పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశాడు. శివాజీ తనకు అవకాశం ఇచ్చిన మాట వాస్తమేనని ఆయన చెప్పాడు. అయితే ప్రమోషన్ విషయంలో తనను పిలవకపోవడమే బాధించిందన్నారు.
రేవన్ యాదు ఆరోపణలపై హీరో శివాజీ స్పందించారు. డిప్రెషన్ లోకి వెళ్లిపోయి అతడు అనవసర రాద్ధాంతం చేస్తున్నాడని అన్నారు. కొత్త దర్శకులెవరైనా ఇలా చేశారా అంటూ ప్రశ్నించారు. ఎందుకు ప్రమోట్ చేయడం లేదో నిర్మాతను అడగాలని యాదుకు శివాజీ సూచించారు. ఏదైనావుంటే నిర్మాతతో మాట్లాడుకోవాలని దర్శకుడికి సూచించినట్టు శివాజీ చెప్పారు. టీవీ చానళ్లు వాళ్లు పిలిస్తే తాను వెళ్లానని, సినిమా గురించి మాట్లాడానని తెలిపారు. దర్శకుడిని ఎందుకు పిలవలేదో టీవీ చానళ్ల వాళ్లను అడగాలన్నారు. వాళ్లు పిలవకపోతే వెళ్లి వాళ్లను ఉతుకు అని వ్యంగ్యంగా అన్నారు.
నాలుగు చానళ్లుకు వెళ్లినా తనను ఎందుకు తీసుకెళ్లలేదని శివాజీని రేవన్ యాదు సూటిగా ప్రశ్నించారు. తాను ఎందుకు ప్రమోట్ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన గురించి కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గురించి హీరో మాట్లాడారని వాపోయారు. తాను ఎంతో కష్టపడి తీసిన సినిమా హిట్టయితే తనకు కనీస గుర్తింపు కూడా రాకపోవడం బాధగా ఉందన్నారు. ప్రమోషన్ పరంగా తనను ప్రొజక్ట్ చేయడం లేదని అన్నారు. ‘బూచమ్మా బూచోడు’ కోసం 18 నెలల కష్టపడి పనిచేశానని, ఈ సినిమా ప్రచారంలో తనకు భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే ఇక నుంచి దర్శకుడు రేవన్ యాదుకు ప్రచారం కల్పిస్తామని శివాజీ హామీయివ్వడంతో వివాదం సద్దుమణిగింది.