త్వరలో మరో మల్టీస్టారర్ సినిమా
ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల
కంబాలచెరువు(రాజమహేంద్రవరంసిటీ) :
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఆ సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మరో మల్టీస్టారర్ సినిమాకు సిద్ధమౌతున్నారు. రాజమహేంద్రవరంలోని హోటల్ పల్లెవంటకు వచ్చిన ఆయన ‘సాక్షి’కి శనివారం ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలోని రేలంగి తాను పుట్టిన ఊరని, 2004లో చిత్రసీమలో ప్రవేశించానని చెప్పారు. వీవీ వినాయక్ వద్ద అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేశానని, తన తొలిచిత్రం వరుణ్‌సందేశ్ హీరోగా వచ్చిన కొత్తబంగారులోకం పెద్ద హిట్ కాగా రెండో సినిమా ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఎంత ఆదరణకు నోచుకుందో అందరికీ తెలిసిందేనన్నారు. తర్వాత ముకుంద, బ్రహోత్సవం చిత్రాలకు దర్శకత్వం వహించానన్నారు. తనకు దాసరి నారాయణరావు అంటే చాలా ఇష్టమని, ఆయనను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పారు. బాహుబలితో ప్రాంతీయభాషా చిత్రమనే విధానం నుంచి బయటకు వచ్చి తెలుగు చిత్రసీమకు ఒక చక్కని బాట ఏర్పాటుచేసిన ఘనత రాజమౌళిదన్నారు. తన తొలిచిత్రం ‘కొత్తబంగారులోకం’కు ఒకేసారి నంది, ఫిల్్మఫేర్ అవార్డులు రావడం మర్చిపోలేనన్నారు.