డైరెక్టర్ల ఎన్నికకు కసరత్తు
ఈ నెల 30తో ముగియనున్న విజయ డెయిరీ ముగ్గురు డైరెక్టర్ల పదవీ కాలం
26 లోపు పూర్తి కానున్న ఎన్నికల ప్రక్రియ
నెల్లూరు రూరల్ : జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సమితి(విజయ డెయిరీ) డైరెక్టర్ల పదవులకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. రొటేషన్ పద్ధతిలో ప్రతి సంవత్సరం ముగ్గురు డైరెక్టర్లకు పదవీ కాలం ముగిస్తుంది. ప్రస్తుతం 15 మంది డైరెక్టర్లలో కొడవలూరు మండలం, నార్తురాజుపాళెం గ్రామ సొసైటీ(ఎంపీఎంఏసీఎస్) అధ్యక్షుడు ఇరువూరు వెంకురెడ్డి, ఆత్మకూరు మండలం, వాసిలి గ్రామ సొసైటీ అధ్యక్షుడు గంగా శ్రీనివాసులు, తోటపల్లి గూడూరు మండలం, సౌత్ఆమలూరు గ్రామ సొసైటీ అధ్యక్షుడు ముప్పవరపు గోపాలకృష్ణ చౌదరి పదవీ కాలం ఈ నెల 30వ తేదీతో ముగుస్తుంది. దీంతో ఈ ముగ్గురు డైరెక్టర్ల పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఎన్నికల అధికారిగా నంద్యాల వరదారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ నెల 26 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. డైరెక్టర్ల పదవులకు పోటీపడే ఆశావాహులు ఇప్పటి నుంచే అధికార పార్టీ నేతల అనుగ్రహం కోసం బారులు తీరుతున్నట్లు సమాచారం. పోటీ చేసే అభ్యర్థి ప్రతిపాదించు అభ్యర్థి, బలపరిచే అభ్యర్థులు ఓటు హక్కు కలిగిన పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం అధ్యక్షులుగా ప్రస్తుతం పదవిలో ఉన్నవారు అర్హులు. నామినేషన్ ఫీజు రూ.1000 చెల్లించాలని ఎన్నికల అధికారి తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్
పోటీ చేసే అభ్యర్థులు నెల్లూరు, వెంకటేశ్వరపురంలోని డెయిరీ మీటింగ్ హాల్లో ఈ నెల 21న ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల లోపు తమ నామినేషన్ దరఖాస్తులను ఎన్నికల అధికారికి అందజేయాలి. అదే రోజు మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 5.00 గంటల వరకు నామినేషన్ల పరిశీలన జరగనుంది.
– నామినేషన్ల ఉపసంహరణ ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుంది. ఆ తరువాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
– వెంటేశ్వరపురం డెయిరీ మీటింగ్ హాల్లో ఈ నెల 26న ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు ఎన్నికలు, అదే రోజు మధ్యాహ్నం 1.00 గంటకు ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాలను విడుదల చేస్తారు.