ఎన్పీడీసీఎల్లో డైరెక్టర్లు ఖాళీ
ఎన్పీడీసీఎల్లో ఖాళీల సమస్య
ఇప్పటికే రెండు పోస్టులు ఖాళీ
రేపటితో మరో డైరెక్టరు పోస్టు
ఏడాదిగా పట్టించుకోని ప్రభుత్వం
విద్యుత్ పంపిణీ వ్యవస్థపై ప్రభావం
కంపెనీలో లోపించిన పరిపాలన
సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ మండలి(టీఎస్ఎన్పీడీసీఎల్)లో ఉన్నత స్థాయి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్త విధానాల అమలు, ప్రణాళిక రూపకల్పనపై ఈ ప్రభావం చూపుతోంది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ పంపిణీ బాధ్యతలను టీఎస్ ఎన్పీడీసీఎల్ నిర్వహిస్తోంది. ఎన్పీడీసీఎల్ పరిధిలో 5,612 గ్రామాలు ఉన్నాయి. వరంగల్ కేంద్రంగా పనిచేసే ఎన్పీడీసీఎల్లో చైర్మన్‌తోపాటు నలుగు డైరెక్టర్లు ఉంటారు.
ఆపరేషన్స్, ఫైనాన్స్, ప్రాజెక్టు, హెచ్ఆర్డీ విభాగాలకు అధిపతులుగా డైరెక్టర్లు వ్యవహరిస్తున్నారు. కీలకమైన ఫైనాన్స్, హెచ్ఆర్డీ విభాగాలకు డైరెక్టర్లు లేరు. టీఎస్ఎన్పీడీసీఎల్ మానవ వనరుల విభాగం(హెచ్ఆర్డీ) డైరెక్టర్ పోస్టు 2015 ఆగస్టు 1న ఖాళీ అయ్యింది. ఆర్థిక విభాగం డైరెక్టర్ సుదర్శన్ పదవీకాలం అదే ఏడాది ఆగస్టు 6తో ముగిసింది. ఈ రెండు డైరెక్టర్లు పోస్టులు ఖాళీగా ఉండగా... ఈనెల(జూలై) 31తో ప్రాజెక్టుల విభాగం పోస్టు ఖాళీ అవుతోంది. దాదాపు ఏడాదిగా రెండు డైరెక్టరు పోస్టులు ఖాళీగానే ఉండడంతో పరిపాలనపరమైన అంశాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పుడు మరో పోస్టు ఖాళీ అవుతుండడంతో ఈ ఇబ్బందులు మరింత పెరగనున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థలో కీలకమైన పోస్టులు ఖాళీ అవుతున్నా ప్రభుత్వం నియామకాలపై దృష్టి పెట్టడంలేదు.
విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) నిబంధనల ప్రకారం ఎన్పీడీసీఎల్లో డైరెక్టర్ కాలపరిమితి మొదట ఐదేళ్లు ఉంటుంది. ఐదేళ్ల పదవీకాలం పూర్తయ్యాక కొనసాగింపునకు అవకాశం ఉంటుంది. 70 ఏళ్ల గరిష్ట వయోపరిమితి మించని వారినే టీఎస్ఎన్పీడీసీఎల్లో డైరెక్టరుగా నియమించాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పాటైన కొన్ని నెలల వరకు టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీగా ఐఏఎస్ అధికారి కార్తికేయమిశ్రా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్)లో డైరక్టర్‌గా పనిచేసిన కె.వెంకటనారాయణను రాష్ట్ర ప్రభుత్వం కార్తికేయమిశ్రా స్థానంలో సీఎండీగా 2014 ఆగస్టులో నియమించింది. ఖాళీ అవుతున్న డైరెక్టరు పోస్టులను మాత్రం భర్తీ చేయడంలేదు.