మోగిన ఎన్నికల నగారా!
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదల కావడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్క సారిగా వేడెక్కింది. ఆయా పార్టీల అభ్యర్థులు, ఆశావహులు ఇక తమ దూకుడు పెంచనున్నారు. వచ్చేనెల 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, డిసెంబర్ 7న ఎన్నికలు జరుగనున్నాయి. మరోవైపు అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే పోలింగ్ నిర్వహణ ఏర్పాట్ల ప్రక్రియలో నిమగ్నమైన అధికారులు మరింత వేగం పెంచనున్నారు.
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల షెడ్యుల్ ప్రకటనతోనే ఉమ్మడి జిల్లాలోని ఆయా పార్టీల అ భ్యర్థులు, అశావహులు అలర్ట్ అయ్యారు. ఇప్పటి కే తొమ్మిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ ప్రచారంలో ముందుంది. నిజామాబాద్ జిల్లా నుంచే ఉమ్మడి జిల్లాల బహిరంగసభలకు టీఆర్ఎస్ శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఇటీవల ఆ పార్టీ భారీ బహిరంగసభను నిజామాబాద్‌లో నిర్వహించింది. అభ్యర్థులు కూ డా ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నా రు. అయితే కొన్ని రోజులుగా టీఆర్ఎస్ అభ్యర్థులంతా ప్రచారానికి విరామమిచ్చారు. తాజాగా ఎన్నికల నగారా మోగడంతో టీఆర్ఎస్ అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రచారానికి రంగంలోకి దిగనున్నారు.
కాగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సందర్భంగా రాజుకున్న అసమ్మతి వేడి ఎట్టకేలకు చల్లారింది. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారాన్ని వేగం పెంచనున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. కానీ స్పష్టత ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రచార బరిలో ఉన్నారు. ము ఖ్యంగా బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అ లీ, ఆకుల లలితలు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. కామారెడ్డిలో ఇటీవల కాంగ్రెస్ రోడ్‌షోను కూడా నిర్వహించింది. ఆ పార్టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పర్యటించారు. రెండు మూ డు రోజుల్లో బోధ న్లో కూడా ఇలాంటి రోడ్‌షో నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీ మా త్రం ఇంకా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలోనే నిమగ్నమైంది. ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం జి ల్లాలోని అభ్యర్థుల ఎంపిక కోసం ఆ పార్టీ ముఖ్యనాయకత్వంతో అభిప్రాయ సేకరణ చేపట్టింది.
ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియ..
ఎన్నికల షెడ్యుల్‌కు ముందే ఏర్పాట్లలో నిమగ్నౖ మెన అధికార యంత్రాంగం ఇక ఈ ఏర్పాట్ల ప్రక్రియను వేగవంతం చేయనుంది. ప్రస్తుతం ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవ ల ముసాయిదాను ప్రకటించిన అధికారులు, కొ త్తగా నమోదు చేసుకున్న ఓటర్లు, జాబితా నుంచి తొలగించే వారి పేర్లు, ఒక పోలింగ్‌బూత్ నుంచి మరో పోలింగ్‌బూత్ పరిధిలోకి తమ పేర్ల మార్పు లు ఇలా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ చేస్తు న్నారు. దీన్ని ఇకపై వేగవంతం చేయనున్నారు.
మరోవైపు ఓటు హక్కు వినియోగంపై అవగాహనా కార్యక్రమాలకు కూడా అధికారులు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ఎన్నికల నియమావళిపై అధికార యంత్రాంగానికి కూడా అవగాహన కల్పించే కార్యక్రమాలను కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేశారు. రెండు జిల్లాల కలెక్టరేట్లలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి, టోల్‌ఫ్రీ నెంబర్లను ప్రకటించారు. అలాగే పోలింగ్ నిర్వహణకు అవసరమైన నోడల్ అధికారులను కూడా ప్రకటించారు. సుమారు 15 అంశాలకు సంబంధించి నోడల్ అధికారులను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఎన్నికల నగారా మోగడంతో ఇటు అధికార యంత్రాంగంతో పాటు, రాజకీయ వాతావరణం మరింత వేడెక్కనుంది.