డిస్కం పరిధిలో రూ.700 కోట్ల నష్టం
విజయనగరం మున్సిపాలిటీ:హుదూద్ తుఫాన్ ధాటికి డిస్కం పరిధిలో రూ.700 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఎం.వి.శేషగిరిబాబు తెలిపారు. 30 ఏళ్లుగా అభివృద్ధి చేసిన విద్యుత్ వ్యవస్థ ఈదురు గాలుల ధాటికి పూర్తిగా నేలమట్టమైందని, దీంతో ఉన్న వనరు ల కన్నా పది శాతం అదనపు నష్టం జరిగి ఉంటుందన్నారు. మరల వ్యవస్థను పూర్తి స్థాయిలో పునరుద్ధరిం చేందుకు సమయం పడుతుందన్నారు. దాసన్నపేట విద్యుత్ భవనంలో విజయనగరం జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థపై గురువారం సమీక్షించారు. ఈ సం దర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తుఫాన్ ధాటికి విశాఖలో నాశనమైన వ్యవస్థను 60 శాతం మేర పునరుద్ధరించామన్నారు. ఆనందపురం, మధురవాడ, సాగర్‌నగర్, గాజువాక తదితర ప్రాంతాల్లో గురువారం నాటికి సరఫరా పునరుద్ధరించామని చెప్పారు.
విజయనగరం జిల్లా వ్యాప్తంగా 40 శాతం పనులు పూర్తి చేశామని, ట్రాన్స్‌కో అధికారులు పెందుర్తి-గరి విడి 220 కేవీ లైన్ సరి చేస్తే 132 కేవీ లైన్ల ద్వారా సరఫరా చేస్తామన్నారు. సింహాచలం నుంచి విజయనగరం వంటితాడిఅగ్రహారం వరకు ఉన్న 132 కేవీ లైన్ వినియోగంలోకి వస్తే విజయనగరం పట్టణంలోని 50 శాతం ప్రాంతాలకు విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంలో పని చేసే 500 మంది వేతనదారులను పునరుద్ధరణ పనులకు వినియోగిస్తున్నట్లు చెప్పారు. విజయనగరం జిల్లాలో ఎస్పీడిఎల్, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్‌కు చెందిన 1300 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని చెప్పారు. ఒడిశా రాష్ట్రం నుంచి అదనంగా మరో 100 మంది సిబ్బందిని రప్పిస్తున్నామని తెలిపారు. భారీ స్థాయిలో కూలిపోయిన విద్యుత్ స్తంభాలను సరి చేసేందుకు ఒడిశా రాష్ట్రం నుంచి 100 క్రేన్లను తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. సాధ్యమైనంత త్వరలో విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.