మనీమూన్..
అదేంటి.. హనీమూన్ అని కదా అనాలి అన్న డౌట్ వచ్చిందా.. ‘డిస్కవర్ ఆఫ్రికా’ సంస్థ వాళ్లు అందిస్తున్న ఈ హనీమూన్ ప్యాకేజీ ధర వింటే మీరూ ఇదే అంటారు. 14 రోజుల హనీమూన్ ట్రిప్ ధర జంటకు రూ.1.5 కోట్లు! ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హనీమూన్ ప్యాకేజీ. ఇందులో భాగంగా మనం దక్షిణ, పశ్చిమ ఆఫ్రికా అందాలను వీక్షించవచ్చు. కేప్‌టౌన్ నగరాన్ని నింగి నుంచి వీక్షించడానికి హెలికాప్టర్ రైడ్, విలాసవంతమైన హోటళ్లలో బస, సఫారీ పార్కుల్లో విహారం వంటివి ఈ ప్యాకేజీలో భాగం. ఇంకేదైనా అదనంగా కావాలనుకుంటే మాత్రం మరింత చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఇక్కడికి రావడానికి, ఇక్కడ్నుంచి ఇంటికి పోవడానికి అయ్యే విమాన చార్జీలను మనమే భరించాల్సి ఉంటుంది.