ఏం చేద్దాం.. ఎలా చేద్దాం
- జిల్లా అభివృద్ధిపై తొలి సమీక్ష
- ప్రభుత్వ పథకాలు, సమస్యలపై విసృ్తత స్థాయిలో చర్చ
- ఇక ప్రతి నెలా సమీక్ష సమావేశాలు
- ఎమ్మెల్యేలకు చెప్పిచేయమని అధికారులకు మంత్రి గంటా ఆదేశం
- ఈ నెల 28న అరకులో సంక్షేమ శిబిరానికి సీఎంకు ఆహ్వానం
-13న విశాఖ, 14న అనకాపల్లిలో వికలాంగుల శిబిరాలకు కేంద్ర మంత్రి రాక
విశాఖపట్నం : ప్రభుత్వం కొలువైన పది నెలలకు తొలిసారిగా విశాఖపట్నం జిల్లా అభివృద్ధికి ఏం చేయాలనే దానిపై ప్రజాప్రతినిధులు సమీక్ష జరిపారు. రాష్ట్ర మానవ వనరులు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎంపీలు కె.హరిబాబు, ముత్తంశెట్టి శ్రీనివాస్, 12 మంది ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ప్రభుత్వ పథకాల అమలులో లోటుపాట్లపై అధికారులను నిలదీశారు. హుద్‌హుద్ తుపాను సాయం, పింఛన్లు, విద్య, వైద్య, వ్యవసాయ శాఖలపై సమీక్ష జరిపారు. అధికారుల వైఫల్యాలను తీవ్రంగా తప్పుబట్టారు. పథకాల లోటుపాట్లను సరిదిద్దుకుని వాటిని అర్హులైన వారికి అందించడం, పథకాల అమలులో అధికారులు, ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం సాధించడం కోసం ఇక ప్రతినెల చివరి శుక్రవారం ఇటువంటి సమీక్షలు జరపనున్నట్లు మంత్రి గంటా ఈ సందర్భంగా ప్రకటించారు. సంక్షేమ పథకాలన్నింటినీ లబ్ధిదారులకు ఒకేచోట అందించేలా ఈ నెల 28న అరకులో భారీ సంక్షేమ శిబిరాన్ని నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13న విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, 14న అనకాపల్లి ఎన్టిఆర్ స్టేడింయంలో వికలాంగుల కోసం ప్రత్యేక సంక్షేమ శిబిరాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎన్.యువరాజ్ వెల్లడించారు. ఈ శిబిరాలకు కేంద్ర మంత్రి అశోక్ గెహ్లట్ హాజరవుతారన్నారు.
నియోజకవర్గాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదనలు రూపొందించేటప్పుడు సంబంధిత ఎమ్మెల్యేలకు తెలియజేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించాల్సిందిగా అధికారులకు గంటా ఆదేశాలిచ్చారు. శాసనసభ్యులు తమ నియోజకవర్గ సమస్యలను చెప్పినపుడు తక్షణమే స్పందించాలన్నారు. బ్యాంకుల ద్వారా పింఛన్ల పంపిణీ చేయాలని ఎంపీ హరిబాబు సూచించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ త్వరలో ప్రభుత్వం మల్టీ ఛానల్ డెలివరీ సిస్టంను ప్రవేశపెట్టనుందని, జిల్లాలో ఓ మండలంలో వచ్చే నెల నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని తెలిపారు. దీని వల్ల పింఛన్ దారులు తాము ఏ విధంగా పింఛన్ పొందాలనుకుంటున్నారనే ఆప్షన్ ఆ విధంగానే చెల్లించే ఏర్పాటు చేస్తామన్నారు. బ్యాంకు, పోస్టాఫీసు, రేషన్ షాపులో పింఛన్లు చెల్లించేలా ప్రభుత్వం ఆలోచిస్తోందని వివరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో విద్యార్ధులను చేర్చుకునే కార్యక్రమం చేపట్టాలని ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇంటర్మీడియెట్ అధికారులకు సూచించారు.
ఏజెన్సీలో హుద్‌హుద్ తుపానుకు దెబ్బతిన్న పాఠశాలల మరమ్మతులకు ఇంకా నిధులు విడుదల కాలేదని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు అన్నారు.యుపి స్కూల్లో తాగునీరు, మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందన్నారు.జిల్లాలో 156 పాఠశాలల మరమ్మతులకు రూ.8.52కోట్లు మంజూరైనట్లు సర్వశిక్ష అభియాన్ పీఓ నగేష్ తెలిపారు. ఈ సమస్యపై నెలవారీ నివేదిక ఇవ్వాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు.తగిన ప్రతిపాదనలు ఇస్తే ఎంపీ లాడ్స్ నుంచి నిధులు ఇస్తానని ఎంపీ హరిబాబు చెప్పారు. కాఫీ తోటలు, ఇతర ఉద్యానపంటల పరిహారం చెల్లింపులో అధికారులు తమ ఇష్టానుసారం వ్యవహరించారని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉందని, విద్య, వైద్య శాఖలతో ఇబ్బందులు ఉన్నాయని పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత అన్నారు.
మధ్యాహ్న భోజన పధకం బిల్లుల బకాయిలు చెల్లించాలని ఎమ్మెల్యే గణబాబు ప్రస్తావించారు.నిధులు విడుదలయ్యాయని నాలుగైదు రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖాధికారి కృష్ణారెడ్డి బదులిచ్చారు. సర్వశిక్ష అభియాన్ ద్వారా పాఠశాల భవనాల నిర్మాణంలో సమస్యలు ఎదురవుతున్నట్లు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. ఉద్యోగ విరమణ పొందిన వారిని బోధకులుగా నియమించే పద్ధతికి స్వస్తి పలకాలని ఆయన సూచించారు. కోళ్ల పరిశ్రమకు సంబంధించి అర్హులకు ఇంత వరకూ తుపాను సాయం అందలేదని, అనర్హుల పేర్లు లబ్దిదారుల జాబితాలో చేర్చారని అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ అన్నారు. వైద్యులు అందుబాటులో ఉండటం లేదన్నారు. బోట్లకు కూడా నష్టపరిహారం అందాల్సిందని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ చెప్పారు. గ్యాస్ సిలిండర్ పేలుడు దర్ఘటన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు తమ నియోజకవర్గ సమస్యలను వివరించారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలం భవానీ, అధికారులు పాల్గొన్నారు.