వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ లోకేష్ కుమార్
భద్రాచలం : వ్యాధుల వ్యాప్తిపై సంబంధిత శాఖల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, నివారణ చర్యలపై శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ డీఎస్ లోకేష్ కుమార్ ఆదేశించారు. బుధవారం ఐటీడీఏ పీఓ చాంబర్లో యూనిట్ అధికారులతో వివిధ అంశాలపై పీఓ రాజీవ్‌తో కలిసి సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. డెంగ్యూ, మలేరియా వ్యాప్తి–నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పిన్ పాయింట్ కార్యక్రమంలో భాగంగా ఏఎన్ఎమ్లు, ఆశా వర్కర్లు, మెడికల్ సిబ్బందితో కలిసి గ్రామాల్లోని ఇంటింటికీ వెళ్లి డెంగ్యూ, మలేరియా ఎందుకు వస్తుందో.. రాకుండా ఉండాలంటే ఏమేం చేయాలో వివరించాలని అన్నారు. గిరిజన గ్రామాల్లో గురు, శుక్రవారాల్లో డ్రై డే నిర్వహించాలన్నారు. దోమల లార్వాలన్నింటి తొలగింపు, ఇంటి పరిసరాల పరిశుభ్రత, జ్వరం వచ్చినప్పుడు వెంటనే సమీప ఆస్పత్రికి వెళ్లడం తదితరాంశాలపై అవగాహన కల్పించాలని, 7 నుంచి 17వ తేదీ వరకు ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఫాగింగ్, స్ప్రేయింగ్ కొనసాగించాలన్నారు. దీనికి కావాల్సిన నిధులను మంజూరు చేస్తామన్నారు. పంచాయతీ, వైద్య సిబ్బంది కలిసి గ్రామాలలో క్లోరినేషన్ పటిష్టంగా అమలయ్యేలా చూడాలన్నారు. భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో డెంగ్యూ ఇల్సా పరీక్షలు నిర్వహించడంతోపాటు వైద్యం కూడా అందుతోందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. వర్షాలు పడుతున్నందున గ్రామాలలో తాగునీటిని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎప్పటికప్పుడు పరీక్షించాలని ఆదేశించారు. గుర్తించిన మండలాలలో పామాయిల్ తోటలను గిరిజన రైతులు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించేందుకు అధికారులు కషి చేయాలన్నారు. ప్రస్తుతం నర్సరీలో ఉన్న మొక్కలను పంపిణీ చేయడంతోపాటు వచ్చే సంవత్సరానికి 40 లక్షలు మొక్కలను పెంచాలని ఉద్యానవన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీడీ (ట్రైబల్ వెల్ఫేర్) ఎం.జయదేవ్ అబ్రహం, ఏడీఎంహెచ్ఓ డాక్టర్ పుల్లయ్య, డీఎంఓ డాక్టర్ ఎం.రాంబాబు, ఏపీఓ (జనరల్) కె.భీమ్రావ్, ఎస్వో డేవిడ్‌రాజ్, ఎస్వో (పీటీజీ )మల్లేశ్వరి, ఏపీఓ (పవర్) అనురాధ, ఉద్యానవన అధికారి జి.మరియన్న, ఏడీఏహెచ్ జి.వెంకయ్య, యూనిట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.