dishtibomma dahanam
-
గజ్వేల్ నియోజకవర్గంలో ‘దళితబంధు’ కోసం రోడ్డెక్కిన దళితులు
జగదేవ్‌పూర్(గజ్వేల్): సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళితులు రోడెక్కారు. దళితబంధును అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం దళితులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దళితబంధు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తిగుల్, నిర్మల్‌నగర్, బస్వాపూర్, అలిరాజ్‌పేట గ్రామాల దళితులు ఆందోళన చేశారు. జగదేవ్‌పూర్ –భువనగిరి ప్రధాన రహదారిపై గంటసేపు నిర్మల్ నగర్ దళితులు రాస్తారోకో చేపట్టారు. ధర్నా కారణంగా రహదారిపై కిలోమీటర్ల మేర అటుఇటు వాహనాలు నిలిచిపోయాయి. ఎస్ఐ చంద్రమోహన్ దళితులతో మాట్లాడి సముదాయించి ధర్నాను విరవింపజేశారు. అనంతరం గ్రామపంచాయతీ ఎదుట సర్పంచ్‌కు వ్యతిరేకంగా దళితులు నిరసన చేపట్టారు. తిగుల్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చౌరస్తాలో దళితులు బైఠాయించి సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. బస్వాపూర్‌లోనూ దళితులు నిరసన తెలిపారు. అలిరాజ్‌పేటలో దళితులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల దళితులు మాట్లాడుతూ దళితబంధును అర్హులందరికీ ఇవ్వాలని, లేదంటే ఎవరికీ ఇవ్వకూడదని అన్నారు. -
ఎమ్మెల్యే జేసీని అరెస్ట్ చేయాలి
వర్సిటీలో కొనసాగుతున్న ఆందోళనలు ఎస్కేయూ : తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రతిష్ట దిగజార్చే విధంగా వ్యవహరించిన జేసీ ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎస్కేయూలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎస్కేయూలో సోమవారం జేసీ ప్రభాకర్‌రెడ్డి దిష్టిబొమ్మను శవయాత్ర చేసి నిరసన తెలిపారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు మాట్లాడుతూ... ప్రజాప్రతినిధిగా ఉంటూ .. తన స్థాయిని మరచి వ్యవహరించిన జేసీ ఎమ్మెల్యే పదవికి అనర్హుడని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజాభ్యుదయానికి పాటుపడుతున్న ప్రతిపక్ష నేతపై అసభ్యపదజాలం ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జీవీ లింగారెడ్డి, నరేంద్రరెడ్డి , ఎస్కేయూ అధ్యక్షుడు వై.భానుప్రకాష్‌రెడ్డి, నాయకులు అమర్నాథ్, రాంబాబు, ఛార్లెస్ ,జయచంద్రా రెడ్డి, హేమంత్ కుమార్, శ్రీనివాసులు, గంగాధర్, తిమ్మరాజు, శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.