విధికి ఎదురీత
భగవంతుడా! బలమివ్వు..
గుక్క పెట్టి ఏడ్వడానికి గుండె గొంతుకలో చుక్క నీరు లేదు. ఏడేళ్ళుగా ఏడ్చీ ఏడ్చీ కన్నీళ్ళన్నీ ఆవిరైపోయాయి. ఏం తప్పు చేశాం అంటూ ఆ భగవంతుడినే నిలదీసేందుకు అవసరమైన శక్తీ లేకపోయింది. ఏళ్ళ తరబడి ఊరూవాడా తిరిగీ తిరిగీ నిస్సత్తువ ఆవహించింది. ఉన్నదల్లా ఒకే మార్గం. దేవుడిని వేడుకోవడం. అందుకే ‘దేవుడా.. కరుణ చూపని విధి నుంచి మా కన్నబిడ్డల్ని రక్షించు’ - అని క్షణక్షణం మూగవేదన అనుభవిస్తున్న ఓ కుటుంబం ప్రార్థిస్తోంది.
రెక్కాడితే కానీ డొక్కాడని ఓ నిరుపేద కుటుంబం ఊహించని ఆపదతో అల్లాడి పోతోంది. ఆపన్న హస్తం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చేస్తోంది. ప్రపంచంలోనే వేళ్ల మీద లెక్కబెట్టదగిన కండరాల బలహీనత (డిజార్డర్ మస్క్యులర్ డిస్ట్రోఫీ) ఆ ఇంట్లోని ఇద్దరి చిన్నారులను ఏడేళ్లుగా వేధిస్తోంది. ఉన్నవన్నీ ఊడ్చిపెట్టిన ఆ తల్లిదండ్రులు, ఇంకా గంపెడాశతో పిల్లలను రక్షించుకునేందుకే ప్రయత్నిస్తున్నారు. అనుక్షణం కళ్ళల్లో వత్తులేసుకుని కష్టపడుతున్నారు. మనసున్న ప్రతి మనిషి గుండెను కదిలించే యథార్థ గాథ ఇది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన కోట వాసుదేవరావు, అన్నపూర్ణ దంపతుల కన్నీటి వ్యధ ఇది.
ముందు ఏమీ అర్థం కాలేదు!
గణేష్, శ్రీనివాస్ ఇద్దరూ పుట్టిన నాలుగేళ్ళదాకా ఆడుతూ పాడుతూనే తిరిగారు. అయితే ఏడేళ్ళ వయసు వచ్చేసరికి ఆ చిన్నారులు నడుస్తూ నడుస్తూనే కుప్పకూలిపోవడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగించింది. బలహీనంగా ఉన్నారేమో అని మొదట అనుకున్నారు. కానీ రానురాను లేవలేని స్థితి. చేతులు ఆడించలేని పరిస్థితి. బెంబేలెత్తిన దంపతులు తమ పిల్లలను వైద్యుని వద్దకు తీసుకెళ్ళారు. డాక్టరుకూ ముందు ఏమీ అర్థం కాలేదు. రకరకాల పరీక్షల తర్వాత అది కండరాల బలహీనత అని తేల్చేశారు. ఈ వ్యాధికి మందులే లేవన్నారు. దీనిపై అమెరికా, లండన్లో పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు.
కన్నీరు మున్నీరయ్యారు
‘అమ్మా... మాకేమైంది? మేం స్కూలుకు వెళ్ళలేమా? అమెరికా వెళ్ళి పెద్ద ఉద్యోగం చేయలేమా?’ అంటూ గణేష్, శ్రీనివాస్ వేసిన ప్రశ్నలు గుండెలను పిండేశాయని అన్నపూర్ణ కన్నీరు మున్నీరు అయ్యారు. ‘‘ఆ క్షణంలో చావాలన్పించింది. భార్యాభర్తలం ఇద్దరం కొన్ని రోజులు తిండి, నీళ్ళు ముట్టకుండా ఏడ్చాం. కన్పించిన దేవుడికల్లా మొక్కాం. నాటు వైద్యం మొదలుకొని, ఆయుర్వేదం, హోమియో అన్నీ వాడాం. ఎవరు ఏం చెప్పినా కాలికి బలపం కట్టుకుని అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఇద్దరు పిల్లలను భుజాల మీద ఎక్కించుకుని వైద్యుల వద్దకు తిరిగేవాళ్ళం. పూర్వీకులు ఇచ్చిన ఇల్లూ, పొలం అన్నీ అమ్మేసి పిల్లలకోసం ఖర్చు చేశాం. అవీ చాలకపోవడంతో అప్పులు చేశాం. అయినా నయం కాలేదు. అమెరికా వెళ్తే కొంత ప్రయోజనం ఉండొచ్చని కొంతమంది చెబుతున్నారు. కానీ చిల్లిగవ్వ లేదు. ప్రైవేటు స్కూల్లో నాకు వచ్చే మూడు వేలు, ఓ ప్రైవేటు కంపెనీలో ఆయనకు వచ్చే ఐదు వేలు... ఇదీ మా సంపాదన. పిల్లల నెలవారీ మందులకే అవి సరిపోతున్నాయి. ఖాళీ సమయంలో ట్యూషన్లు చెబితే వచ్చే సంపాదన, కుట్లూ అల్లికలపై నిద్రలేకుండా తెచ్చే మొత్తంతోనే కుటుంబం గడుస్తోంది’’ అని ఉబికి వస్తున్న కన్నీళ్లను బలవంతంగా ఆపుకునే ప్రయత్నం చేస్తూ చెప్పారు అన్నపూర్ణ.
ఇంట్లో ఉంటూనే అద్భుత పరిజ్ఞానం
సామాజిక, వైజ్ఞానిక విషయాలకు సంబంధించిన ప్రశ్నలకు ఈ చిన్నారులు చెప్పే సమాధానం అబ్బురపరుస్తాయి. ఇంట్లోనే ఉండి చదువుకోవడమే కాదు. స్కూల్ విద్యార్థులతో సమానంగా పరీక్షలు రాయడం, అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం విశేషం. కొన్నాళ్ళు స్కూలుకెళ్ళి పరీక్షలు రాసేవాళ్ళు. కదలలేని వాళ్ళ స్థితిని చూసి, ఉపాధ్యాయులే ఇంటికొచ్చి పరీక్షలు రాయిస్తున్నారు. 13 ఏళ్ళ గణేష్ ఇప్పుడు 8 వ తరగతి, 12 ఏళ్ళ శ్రీనివాస్ 7వ తరగతి చదువుతున్నారు.
ఫొటోలు: రాధారపు రాజు, ఖమ్మం
అమ్మా ఏడ్వకు... అమెరికా వెళ్ళి నీ కష్టం తీరుస్తా!
అమ్మా! నాకేం కాదు. నేను అమెరికా వెళ్తా. పెద్ద చదువులు చదువుతాను. నీ కన్నీళ్లు తుడుస్తా. ఈ జబ్బుకు మందులు వస్తాయని మొన్న డాక్టర్ అంకుల్ చెప్పారుగా. ఎందుకమ్మా దిగులు?
- శ్రీనివాస్
నా కడుపుకోత తీర్చేదెవరు: అన్నపూర్ణ
వాళ్ళకు అన్నీ మంచంలోనే. రానురాను మరింతగా బలహీనపడతారనే వైద్యుల మాటలు తట్టుకోలేకపోతున్నారు. ముద్ద నోటికి అందించేప్పుడు, నిద్రపుచ్చేటప్పుడు, కాలకృత్యాలు తీర్చేటప్పుడు ‘అమ్మా...’ అంటూ వాళ్ళు పడే బాధ నా గుండెను కకావికలం చేస్తోంది.
అనుక్షణం క్షోభ : వాసుదేవరావు
నా పిల్లలకు నయం చేసుకోవాలని ఉంది. అది పెద్ద కోరికే అయినా, వాళ్లను కన్నీళ్ళు లేకుండా చూసుకోవాలి. కానీ ఆర్థిక భారం నన్ను కుంగదీస్తోంది. కన్నతండ్రిగా నా వైఫల్యం అనుక్షణం క్షోభకు గురిచేస్తోంది. చిన్నారుల కోసం ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తే బాగుండు.