dispensary
-
‘ఆయుష్’కు కొత్త కళ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆయుష్ డిస్పెన్సరీలు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. రంగులు వెలిసిపోయి, పాచిపట్టి అధ్వానంగా కనిపించే డిస్పెన్సరీలు కళకళలాడుతున్నాయి. రోగులకు అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్ అవసరాల కోసం ముందుగానే మందులు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా అల్లోపతి ఆస్పత్రుల రూపురేఖలు మార్చినట్లుగానే ఆయుష్ ఆస్పత్రులను సైతం అన్ని విధాలా అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా తొలి దశలో ఎంపిక చేసిన 110 డిస్పెన్సరీలను ఆధునికీకరిస్తున్నారు. ఒక్కో డిస్పెన్సరీకి రూ.3.5 లక్షలు కేటాయించి భవనాలకు మరమ్మతులు చేసి రంగులు వేస్తున్నారు. ఎలక్రి్టకల్, ప్లంబింగ్ పనులు చేస్తున్నారు. సోలార్ ప్యానల్స్‌ను అమర్చి విద్యుత్ ఆదాకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 95 డిస్పెన్సరీల్లో మరమ్మతులు, రంగులు వేయడం వంటి పనులన్నీ పూర్తయ్యాయి. రూ.12 కోట్లతో మందుల సరఫరా ఈ ఏడాది మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 735 ఆయుష్ డిస్పెన్సరీలకు రూ.3 కోట్లతో ప్రభుత్వం మందులు సరఫరా చేసింది. ఈ మందులు వినియోగంలో ఉండగానే భవిష్యత్‌లో కొరత లేకుండా మరో రూ.12 కోట్ల విలువైన మందులను కొనుగోలు చేస్తోంది. రెండు నెలల్లో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసి డిస్పెన్సరీలకు మందులను సరఫరా చేయనుంది. ఇంగ్లిష్ మందుల తరహాలోనే ఆయుష్ మందులను కూడా ట్యాబ్లెట్లు, క్యాప్సుల్స్, సిరప్స్, టానిక్స్ రూపంలో అందజేసేలా కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం 110 డిస్పెన్సరీలను ఆధునికీకరిస్తున్నామని, విడతల వారీగా అన్ని ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామని ఆయుష్ కమిషనర్ డాక్టర్ ఎస్బీ రాజేంద్రకుమార్ లగింశెట్టి తెలిపారు. -
జిల్లాకో ఈఎస్ఐసీ డిస్పెన్సరీ, బ్రాంచి ఆఫీస్
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) డిస్పెన్సరీ కమ్ బ్రాంచి కార్యాలయాలను జిల్లాకొకటి చొప్పున దేశవ్యాప్తంగా ప్రారంభించాలని కార్మికశాఖ నిర్ణయించింది. ఆ శాఖ మంత్రి గంగ్వార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా ప్రారంభించే ఈఎస్ఐసీ డిస్పెన్సరీ కమ్ బ్రాంచి ఆఫీసు(డీసీబీవో)లు ప్రాథమిక వైద్యంతోపాటు రెఫరెల్ సేవలు, బిల్లుల పరిశీలన, మందుల పంపిణీ వంటి సేవలను అందిస్తాయి. డీసీబీవోల నిర్వహణ బాధ్యతను ఈఎస్ఐసీ చూస్తుంది. ఈఎస్ఐసీ ఆస్పత్రుల్లో నర్సింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంను ప్రారంభించాలని కూడా కార్మికశాఖ నిర్ణయించింది. ఇంటర్న్‌షిప్ కాలంలో నర్సులకు రూ.22వేల స్టైపెండ్‌ను కూడా అందించనుంది. కొన్ని ఈఎస్ఐసీ ఆస్పత్రుల సామర్థ్యాన్ని పెంచటంతోపాటు కొత్త ఆస్పత్రుల నిర్మాణానికి కూడా ఈ సమావేశం ఆమోదం తెలిపింది. -
చికిత్స ఎక్కడో మందులూ అక్కడే
సాక్షి, హైదరాబాద్: డిస్పెన్సరీల్లోనే మందులు అందుబాటులో ఉంచేలా ఆర్టీసీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గతంలో మాదిరిగా డిస్పెన్సరీల్లోనే మందులు అందుబాటులో ఉంచేలా, ఒకవేళ డిస్పె న్సరీకి చేరువలో సంబంధిత సంస్థ మెడికల్ షాపు ఉంటే అక్కడ ఇచ్చేలా ఆర్టీసీ ఎండీ రమణారావు ఆదేశాలు జారీ చేశారు. మందుల సరఫరాను ప్రైవేటు సంస్థకు అప్పగిం చడంతో డిస్పెన్సరీల్లో కాకుండా తమ సొంత మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసేలా ఆ సంస్థ ఏర్పాట్లు చేసింది. మందుల కోసం మరో ప్రాంతానికి వెళ్లాల్సి రావడంతో అనారోగ్యంతో ఉన్న సిబ్బందికి ఇబ్బంది ఎక్కువైంది. దీనిపై ‘చికిత్స ఓ చోట.. మందులో చోట’ శీర్షికతో ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. స్పందించిన ఆర్టీసీ ఎండీ సంబంధిత అధికారులతో సమావేశమై దిద్దుబాటు చర్యలకు ఆదేశాలిచ్చారు. ‘ఆర్టీసీ యాజమాన్యం ఏ నిర్ణయం తీసుకున్నా కార్మికులకు అనుకూలంగా ఉండాలి. అనారోగ్యంతో డిస్పెన్సరీకి వచ్చే కార్మికులు మందుల కోసం మరో ప్రాంతానికి వెళ్లడం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి నిర్ణయాలు ఎప్పుడూ మేం అమలుచేయం. ఎక్క డైనా ఆ తరహా పరిస్థితి ఉంటే చక్కదిద్దుతాం. ఆర్టీసీ తార్నాక ఆస్పత్రిలో ఫార్మసీని ప్రైవేట్‌కు అప్పగించాక మందుల కొరత సమస్య తీరింది’ అని చెప్పారు. -
డిస్పెన్సరీ తరలింపు తప్పదా?
జగిత్యాల: నిత్యం 40–50 మంది ఆస్పత్రికి రోగులు వస్తుంటారు. దీంతోపాటు ఈ డిస్పెన్సరీ కింద పలు గ్రామాల్లో మోతె, ధరూర్, చల్గల్, అంతర్గాం, తాటిపల్లి, జాబితాపూర్ గ్రామాల్లోని ప్రజలకు వైద్య సేవలందిస్తుంటారు. ఎస్సారెస్పీ ఏర్పడ్డప్పుడు వారి ఆధ్వర్యంలో ధరూర్ క్యాంప్‌లోని ఇరిగేషన్ కార్యాలయ సమీపంలో ప్రభుత్వ సివిల్ డిస్పెన్సరీ ఏర్పాటు చేశారు. దీనిని ఇటీవలే పీహెచ్సీగా అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం ఇరిగేషన్ కార్యాలయ సమీపంలోనే నూతనంగా నర్సింగ్ కళాశాలను నిర్మిస్తున్నారు. అయితే పురాతన భవనం కావడంతో దానిని కూల్చివేస్తామని ఆదేశాలు జారీ చేయగా వారు ఇటీవలే ఎస్సారెస్పీ గెస్ట్‌హౌస్‌కు ప్రభుత్వ సివిల్ డిస్పెన్సరీని తరలించారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఐదు కిలోమీటర్ల దూరంలోని టీఆర్‌నగర్‌కు తరలించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నతాధికారులు వారిపై ఒత్తిడి తెస్తున్నారు. సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గెస్ట్‌హౌస్ భవనమే సరిపోవడం లేదని టీఆర్‌నగర్‌లో వసతి సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆస్పత్రి కింద ప్రతీసారి ఇమ్యూనైజేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ భవనంలోనే సరైన మౌలిక వసతులు లేక ఇబ్బందులకు గురవుతుంటే మళ్లీ దీనిని టీఆర్‌నగర్‌కు తరలించడం సమంజసంకాదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ డిస్పెన్సరీ పరిధిలో... ప్రస్తుతం క్యాంప్‌లోని ఎస్సీ, ఎస్టీ హాస్టల్, కస్తూర్బా విద్యార్థులకు వైద్యం అందిస్తుంటారు. దీంతోపాటు మోతె పరిధిలోని మోతె, గోవిందుపల్లి, వెల్దుర్తి, గొల్లపల్లి, బావోజీపల్లి, ధరూర్ పరిధిలో ధరూర్, టీఆర్‌నగర్, నర్సింగాపూర్, వంజరిపల్లి, ఎల్లాలపల్లి, అంతర్గాం పరిధిలో అంతర్గాం, హస్నాబాద్, అంబారిపేట, లింగంపేట, చల్గల్ పరిధిలో చల్గల్, మోరపల్లి, తాటిపల్లి పరిధిలో తాటిపల్లి, మోరపల్లి, జాబితాపూర్ పరిధిలో జాబితాపూర్, తిమ్మాపూర్, రఘురాములకోటకు చెందిన ప్రజలు వైద్యం పొందుతారు. మౌలిక వసతులు కరువు ప్రస్తుతం ఈ భవనంలోనే కరెంట్, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం లేక ఇబ్బందులకు గురవుతున్నారు. మందులకు ఇంజక్షన్లకు తప్పకుండా ఫ్రిజ్ అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో రెండు ఫ్రిజ్‌లు ఉండగా టీఆర్‌నగర్‌లోని గదిలో పట్టే అవకాశం లేదు. -
సచివాలయంలో సివిల్ డిస్పెన్సరీ
హైదరాబాద్: వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో సివిల్ డిస్పెన్సరీని ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. రాష్ట్రం విడిపోక ముందు హైదరాబాద్ సచివాలయంలో డిస్పెన్సరీ ఉండేది. వెలగపూడిలోని ఏపీ సచివాలయానికి కొత్త డిస్పెన్సరీ అవసరమైంది. అత్యవసర వైద్యంలో భాగంగా ఇద్దరు వైద్యులు, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఇద్దరు అటెండర్లు, ఒక స్వీపర్‌తో మొత్తం తొమ్మిదిమంది ఈ డిస్పెన్సరీలో విధులు నిర్వహిస్తారు. డిస్పెన్సరీలో సచివాలయ సిబ్బందికి వివిధ రకాల రక్త పరీక్షలు అందుబాటులో ఉంటాయి. సామాజిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో వైద్యం పొందే అవకాశం ఉంటుంది. సచివాలయంలో రెండు వేల మంది సిబ్బంది ఉండటంతో పాటు పలువురు అధికారులు కూడా ఇక్కడకు వచ్చివెళ్తుంటారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ డిస్పెన్సరీ పని చేస్తుంది. కాగా ఈ డిస్పెన్సరీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ పరిధిలోకి వస్తుంది. తాజాగా ఏర్పాటు చేయనున్న డిస్పెన్సరీకి సిబ్బందిని కూడా వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్న వారినే డెప్యుటేషన్ మీద నియమించనున్నట్టు తెలిసింది.