Disputed land
-
వివాదాస్పద ప్రాంతాల నుంచి వెనక్కి మళ్లాల్సిందే..
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి ఇరు దేశాల బలగాలు ఎప్పటిలోగా వెనక్కి వెళ్లాలన్న దానిపై ప్రణాళిక రూపొందించేందుకు భారత్–చైనా మిలిటరీ కమాండర్లు మంగళవారం సమావేశమయ్యారు. 10 గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. లెఫ్టినెంట్ జనరల్ అధికారుల స్థాయిలో జరిగిన ఈ నాలుగో సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట ఉన్న సాయుధ బలగాలు, ఆయుధాలను సాధ్యమైనంత త్వరగా వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దులో మే 5వ తేదీకి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని భారత కమాండర్లు పేర్కొన్నారు. ఇందుకు ఇరు దేశాలు చర్యలు చేపట్టాలని కోరారు. లద్ధాఖ్లోని కొన్ని ప్రాంతాలను తమ భూభాగాలుగా చైనా కొనసాగిస్తూ చేస్తున్న కొత్త వాదన పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్చల్లో భారత్ బృందానికి లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వం వహించారు. -
దళితుల భూములు కబ్జా
సీఐ, తహసీల్దార్ల పర్యవేక్షణలో చింతకుంట అసైన్డ్ భూముల్లోని పెసర పంటను కోసిన పొలాల వద్ద ఉద్రిక్తత.. పోలీసుల మోహరింపు జోగిపేట: అందోలు మండలం చింతకుంటలో దళితులకు పంపిణీ చేసిన భూములు కబ్జాపరమయ్యాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో గురువారం సీఐ వెంకటయ్య, తహసీల్దార్ నాగేశ్వరరావు సిబ్బందితో వెళ్లి గ్రామంలోని భూములను పరిశీలించారు. ప్రభుత్వ భూమిలో ఉన్న పెసర పంటను రెవెన్యూ శాఖ పరిధిలోని గ్రామ సేవకులతో కోయించారు. మూడెకరాల పొలంలో కోసిన పెసర పంటను స్థానిక పోలీసు స్టేషన్లో భద్రపరిచారు. గ్రామంలో 572, 634,635,636, 637,638 సర్వే నంబర్లలో సుమారుగా 302 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొంత భూమిని నిరుపేదలైన దళితులకు పంపిణీ చేయగా 39 ఎకరాలు పంపిణీ చేయకుండా మిగిలి ఉంది. గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని స్థానిక ఎస్సీలు తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం కలెక్టర్, జేసీ, ఎమ్మెల్యే దృష్టికి వెళ్లింది. రోజు రోజుకు ఎస్సీల ఆందోళన ఉధృతం కావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు 638 సర్వే నంబరులోని మూడెకరాలలో ఉన్న పెసర పంటను గురువారం గ్రామ సేవకులు కోశారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ, మన్మొహన్సింగ్ గ్రామానికి చెందిన దళితులకు ఈ భూములను పంపిణీ చేశారని, ఈభూములు ఇతరులు పేర్లపై ఎలా మారాయంటూ దళిత సంఘాల నాయకులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. వివాదస్పద భూమి వద్దకు పోలీసులు, రెవెన్యూ అధికారులు రావడంతో గ్రామంలోని దళిత కుటుంబాలకు చెందిన వారు వందల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. టేక్మాల్ ఎస్ఐ రమేశ్, అల్లాదుర్గం ఎస్ఐ గౌస్‌తో పాటు జోగిపేట ఏఎస్ఐ, డిప్యూటీ తహసీల్దార్ కిష్టయ్య, ఆర్ఐ సతీష్, వీర్‌ఓలు, వీఆర్ఏలు అక్కడికి చేరుకున్నారు. 2, 3 రోజుల్లో సర్వేలు నిర్వహిస్తాం : తహసీల్దారు వివాదస్పద సర్వే నంబర్ 638లోని భూమిని 2,3 రోజుల్లో సర్వే చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారని తహసీల్దారు నాగేశ్వరరావు తెలిపారు. సర్వే నివేదిక వచ్చేంతవరకు ఇతరులు ఈ భూమిలోకి ప్రవేశించకూడదన్నారు. ఈ భూమిని సర్వే చేసేందుకు ఐదుగురు సర్వేయర్లను నియమించామన్నారు. సర్వేలో భూమి ఎవరిదని తేలితే వారికే అప్పగిస్తామని ఒక్కరొక్కరి పేర ఎంత భూమి ఉండాలో నిబంధనల ప్రకారం అంతే ఉండాలని ఎక్కువగా ఉంటే ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుందన్నారు. చింతకుంట భూములకు సంబంధించి రెండు వర్గాల మధ్య వివాదం ఏర్పడడం వల్ల సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసామని సీఐ వెంకటయ్య తెలిపారు. -
స్పీకర్ కోడెల కుమారుడి అనుచరుల వీరంగం
సత్తెనపల్లి (గుంటూరు) : సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల సమీపంలో ఓ రైతుకు చెందిన పొలంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల కుమారుడు శివరామకృష్ణ అనుచరులు సోమవారం మధ్యాహ్నం వీరంగం సృష్టించారు. వివాదాస్పద భూమికి సంబంధించి కోర్టు తమకు అనుకూలంగా తీర్పు చెప్పిందని 50మంది వ్యక్తులు బలవంతంగా పొలం వద్దకు వెళ్లి అక్కడి పంటను ధ్వంసం చేశారు. అలాగే కోళ్లఫారం కూడా తొలగించారు. శనివారం రాత్రి కూడా ఎర్ర మాస్కులు ధరించిన దుండగులు పొలంలోకి జొరబడి కోళ్లఫారం వద్ద నిర్మించుకున్న ఇంటిని ధ్వంసం చేశారు. ఈ విషయమై ఆ భూమికి చెందిన రైతు సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తర్వాత బాధితుడితోపాటు గ్రామస్తులు రాస్తారోకో చేశారు. ఈ గొడవ సద్దమణగకముందే సోమవారం మధ్యాహ్నం మరోసారి పొలంలోకి చొరబడి పంట నాశనం చేస్తున్నారని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు పొలంలోకి ఎవరినీ వెళ్లనీయకుండా చూస్తున్నారుగానీ లోపల జరుగుతున్న విధ్వంసాన్ని అడ్డుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ వివాదాస్పద భూమి 17 ఎకరాలు ఉంది. దీనిపై కన్నేసిన స్పీకర్ కోడెల కుమారుని అనుచరులు పోలీసుల సాయంతో భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నిస్తున్నారని బాధిత రైతు ఆరోపించాడు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.