భార్య హత్య కేసులో భర్త, ప్రియురాలికి జీవిత ఖైదు
సిద్దవటం: జీవితాంతం తోడు నీడగా ఉంటానని ఏడడుగులు నడిచిన భర్త వివాహమైన మూడు నెలలకే మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలో ప్రియురాలితో కలిసి కట్టుకున్న భార్యను కర్కశంగా కడతేర్చాడు. నేరం రుజువు కావడంతో జిల్లా అడిషనల్ జడ్జి అన్వర్‌బాషా బుధవారం భర్త, ప్రియురాలికి జీవిత ఖైదు శిక్ష విధించారని ఎస్ఐ అరుణ్‌రెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళితే.. పోరుమామిళ్ల మండలం నారాయణపల్లె గ్రామానికి చెందిన మనోహర్‌కు కాశినాయన మండలం నాయినపల్లె గ్రామానికి చెందిన విజయలక్ష్మితో 2012 జనవరిలో వివాహమైంది. వివాహం అనంతరం వారు కడప లోని అశోక్‌నగర్‌లో కాపురం పెట్టారు. పెండ్లి అయిన మూడు నెలలకే మనోహర్‌కు చాపాడు మండలం చీపాడు గ్రామానికి చెందిన మేరీతో కడపలో పరిచయ మేర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరు కలిసి 2012 జూన్ నెలలో కూల్ డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి విజయలక్ష్మికి తాపించారు. ఆమె స్పృహ కోల్పోవడంతో ఆటోలో సిద్దవటం మండలం కనుమలోపల్లె గ్రామ సమీపంలోని అడవుల్లోకి తీసుకెళి్ల చంపేశారు. అప్పట్లో వారిపై సిద్దవటం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి కడప కోర్టులో వాదోపవాదాలు విన్న తరువాత నేరం రుజువు కావడంతో జిల్లా ఆదనపు జడ్జి అన్వర్‌బాషా బుధవారం మనోహర్, మేరీలకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారని సిద్దవటం ఎస్ఐ వివరించారు.