పాటల్లాగే వార్తలూ వినొచ్చు!
న్యూస్ ప్లేయర్‌ను పరిచయం చేసిన న్యూస్‌డిస్టిల్
అన్ని పత్రికలు, చానళ్ల వార్తలు ఒకే వేదికగా
25 విభాగాలు.. 8 భాషల్లో సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ రోజుల్లో ఆన్లైన్లో వార్తలు చదవటం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే దాదాపు అన్ని పత్రికలూ ఈ-పేపర్లను అందుబాటులో ఉంచుతున్నాయి. కానీ, ఒకే వేదికగా అన్ని పత్రికలూ, టీవీ చానెళ్ల వార్తలు అందుబాటులో ఉండే వాటి గురించి మాత్రం ప్రస్తావించాల్సిందే? ఒక వార్తను ఏ ఏ మాధ్యమాలు ఎలా విశ్లేషించాయో తెలుసుకునే వీలుంటే?.. బ్లూ టూత్ ద్వారా ఫోన్లోని పాటలను విన్నట్టే.. వార్తలనూ వినే అవకాశమే ఉంటే?? .. ఇదిగో అచ్చం ఇలాంటి సేవలనే అందిస్తోంది స్టార్టప్ కంపెనీ ‘న్యూస్‌డిస్టిల్’. సంస్థల సేవల గురించి మరిన్ని వివరాలు న్యూస్‌డిస్టిల్ కో-ఫౌండర్ నరసింహారెడ్డి మాటల్లోనే..
నా స్నేహితులు వంశీ, భాస్కర్‌రెడ్డితో కలసి రూ.10 లక్షల పెట్టుబడితో గతేడాది ఏప్రిల్‌లో న్యూస్డిస్టిల్ను ప్రారంభించాం. ఒక వార్తపై భిన్నమైన పార్శ్వాలను పాఠకులకు పరిచయం చేయడమే న్యూస్‌డిస్టిల్ పని. వార్తలను చదవటమే కాక వినే వీలునూ కల్పించడం మా ప్రత్యేకత. ఇందుకోసం దేశంలోనే తొలిసారిగా న్యూస్ప్లేయర్ను అభివృద్ధి చేశాం. పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నాం కూడా. న్యూస్ప్లేయర్లో బ్లూ టూత్ సహాయంతో పాఠకుడు కోరుకున్న ఆర్టికల్ లేదా నచ్చిన శీర్షిక ప్రకారం వార్తలను వినొచ్చు. అంతేకాదు ఒకవైపు ఆర్టికల్‌ను వింటూనే మరోవైపు మరో ఆర్టికల్‌ను బ్రౌజ్ చేయవచ్చు కూడా. ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనే న్యూస్ ప్లేయర్ అందుబాటులో ఉంది. మరో రెండు నెలల్లో తెలుగు, మరాఠీ భాషల్లోనూ వినే వీలును కల్పిస్తాం. న్యూస్ ప్లేయర్ మాత్రమే కాదు!! పాకెట్, రికమెండేషన్, మై ఫీడ్, న్యూస్ కంపారిజన్, పర్సనలైజ్డ్ ఫిల్టరింగ్ వంటి ఫీచర్లను కూడా అందిస్తున్నాం.
{పస్తుతం తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళం, మరాఠీ, కన్నడ, మలయాళం, బెంగాలీ 8 భాషల్లో వార్తలను చదువుకోవచ్చు. 550 న్యూస్ పోర్టల్స్ నుంచి వార్తలను సంగ్రహించి నిర్ణీత క్రమపద్ధతిలో అమరుస్తాం. దీంతో పాఠకుడు తనకు నచ్చిన అంశంపై వివిధ మాధ్యమాల్లోని వార్తలను తక్కువ సమయంలో చదువుకునే వీలుంటుంది. ఇలా జాతీయ, అంతర్జాతీయ, విజ్ఞానం, వినోదం, క్రీడలు, ఆరోగ్యం, విద్యా, వైద్యం.. వంటి 25 విభాగాల వార్తలను ఎంపిక చేసుకునే వీలుంది.
ఇప్పటివరకు 2.50 లక్షల యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. నెలకు 25 మిలియన్ల పేజీ వ్యూలొస్తాయి. సీడ్రౌండ్లో భాగంగా నిధులు సమీకరిస్తున్నాం. డ్రాప్‌బాక్స్ వైస్ ప్రెసిడెంట్ గణేశ్, ఓలా వైస్ ప్రెసిడెంట్ సునీల్, ఉబర్ ప్రకటన విభాగం ఉద్యోగి సుధీర్ ఈ పెట్టుబడులు పెట్టనున్నారు. అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. త్వరలో అధికారికంగా ప్రకటిస్తాం. ఇప్పటివరకు రెవిన్యూ మోడల్లోకి వెళ్లలేదు. 100 మిలియన్ల యూజర్లకు చేరుకున్నాక డిస్ప్లే యాడ్స్, క్లిప్పింగ్స్ వంటి వాటితో ఆదాయ మార్గాల్ని తెరుస్తాం.