విభజన వివాదాలపై ఢిల్లీలో పంచాయితీ
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీ పంచాయితీ ఢిల్లీకి చేరింది. కేంద్ర హోంశాఖ సారథ్యంలోని వివాదాల పరిష్కార కమిటీ శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం కానుంది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. రాష్ర్ట విభజనలో భాగంగా నిధులు, ఆస్తులు, అప్పుల పంపిణీ అంశాలను ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న వివాదాలతోపాటు.. ఇప్పటివరకు జరిగిన విభజనను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఇందుకు వీలుగా సంబంధిత సమగ్ర సమాచారాన్ని రెండు రాష్ట్రాల నుంచి ఇప్పటికే స్వీకరించింది. పునర్విభజనకు ముందున్న పన్నుల బకాయిల పంపిణీని ప్రధానంగా ప్రస్తావించాలని తెలంగాణ సర్కారు పట్టుదలతో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో పన్నుల బకాయిలు భారీ మొత్తంలో పేరుకుపోయాయి.
ఎక్సైజ్ డ్యూటీ, వాహనాల పన్ను, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల పన్ను, గనులు-ఖనిజ వనరులు, ల్యాండ్ రెవెన్యూ, విద్యుత్ బకాయిలు కలిపితే మొత్తం రూ.7,326 కోట్ల పాత బకాయిలున్నట్లు ఇటీవలే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తమ నివేదికలో ప్రస్తావించింది. 2014 మార్చి 31 వరకు ఉన్న ఈ బకాయిల్లో దాదాపు రూ. 2,337.06 కోట్లు ఐదేళ్లుగా పేరుకుపోయాయి. వీటి పంపిణీ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. బకాయిలను ఆస్తిగా పరిగణించి జనాభా ప్రాతిపదికన తెలంగాణకు 41.68 శాతం, ఏపీకి 58.32 శాతం పంచుకోవాలని పొరుగు రాష్ర్టం పట్టుబడుతోంది. కానీ ఏ ప్రాంతంలో ఉన్న బకాయిలను ఆ ప్రభుత్వమే స్వీకరించాలని తెలంగాణ సర్కారు వాది స్తోంది. హైదరాబాద్లో వచ్చే రెవెన్యూ బకాయి మొత్తం తెలంగాణ సర్కారుకే చెందుతుందని అంటోంది. దీంతో ఈ అంశం పెండింగ్లో పడింది. ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించి పునర్విభజన చట్టంలోని ఏడో షెడ్యూలులో ఉన్న అంశాలపై తాజా భేటీలో కేంద్ర కమిటీ దృష్టి సారించనుంది. దీనికితోడు ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల పంపిణీ, ఇటీవల ఏపీ ఉన్నత విద్యామండలి నిధులు, బ్యాంకు ఖాతాల నిలిపివేతపై హైకోర్టు తీర్పు ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.
అలాగే కేంద్ర రుణాల పంపిణీ, నాబార్డు, వరల్డ్ బ్యాంకు, జైకా తదితర సంస్థల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న అప్పుల పంపిణీ కూడా జరగాల్సి ఉంది. ప్రాజెక్టులవారీగా పంచుకోవాలా లేక జనాభా ప్రాతిపదికన పంచుకోవాలా అనేది తేలాల్సి ఉంది. ఈ అప్పులకు సంబంధించి లెక్కలు కూడా లేకపోవడం గందరగోళంగా మారింది. దీంతో రుణ సంస్థల వద్ద గణాంకాలనే పరిగణనలోకి తీసుకోవాలని రెండు రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.