పొరుగు రాష్ట్రాలతో గొడవ పడం : ఏపీ సీఎం
సాక్షి, బెంగళూరు: నదీ జలాల పంపిణీ తదితర అంశాల్లో పొరుగు రాష్ట్రాలతో గొడవలు పడదలుచుకోలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆయన మంగళవారం కర్ణాటక రాజధాని బెంగళూరులో పర్యటించారు. ఐటీ సంస్థ న్యూటానిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ-కర్ణాటక మధ్య నదీజలాల వివాదంపై చర్చిం చేందుకు చంద్రబాబు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో భేటీ అవ్వాలని భావించారు. ఈనెల 10న బాబుకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం.
చంద్రబాబుకు చేదు అనుభవం
కర్ణాటక పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు ఇక్కడ నిర్వహించిన కార్యక్రమం ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సందర్భంగా జీఎం ఫార్మా ప్రతినిధి శాంతలారెడ్డి మాట్లాడుతూ ‘మీ నుండి అనుమతులు త్వరగానే వస్తాయి గానీ ఆ తర్వాతే మాకు అసలైన కష్టాలు మొదలవుతాయి. ఇందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ. హిందూపురం ప్రాంతంలో పారిశ్రామిక అవసరాల కోసం మూడు ఎకరాలు కొనేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా.
అనుమతులు త్వరగానే వచ్చాయి, రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. తీరా స్థలాన్ని చదును చేయడానికి వెళ్లినపుడు 25 మంది మాపై భౌతిక దాడులకు పాల్పడేందుకు ప్రయత్నించారు. అధికారులకు చెప్పినా ప్రయోజనం లేదని’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఊహించని విధంగా ఆమె ఇలా నిలదీసేసరికి తత్తరపాటుకు గురైన చంద్రబాబు.. సమస్యను పరిష్కరిస్తామని చెబుతూ మరొకరు మాట్లాడడానికి అవకాశమిచ్చారు.