పైసలిస్తేనే పింఛన్!
సాక్షి, హన్మకొండ : పింఛన్ల వ్యవహారం పంపిణీదారులకు కాసులు కురిపిస్తోంది. జాబితాలో పేర్లు లేకపోవడం, ఉన్నా అచ్చు తప్పులు రావడం, ఆధార్, ఓటరు కార్డులు, ఇంటి నంబర్లు సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు అధికారులు ఆసరా పింఛన్లు నిలిపి వేస్తున్నారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం ఉండడం లేదు. జాబితాలో పేరు రావాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో కొందరు రాజకీయ నాయకులుకూడా రంగ ప్రవేశం చేసి చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
పైసలివ్వు.. పింఛన్ పట్టు..
జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 2.70 లక్షల మం ది పింఛన్లు పొందుతున్నారు. ఇటీవల వృద్ధా ప్య, వితంతు, వికలాంగ తదితర పింఛన్ల కో సం పాత, కొత్త వారు కలిపి జిల్లాలో 5.40 లక్ష ల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3.20 లక్షల మందిని అర్హులుగా పేర్కొంటూ అధికారులు మొదటి జాబితా విడుదల చేశారు. సమగ్ర సర్వే సందర్భంగా జరిగిన పొరపాట్లు, ధ్రువీకరణ పత్రాల్లో అచ్చుతప్పులు, సకాలం లో అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పిం చకపోవడం వంటి కారణాలతో వేలాది మంది ని అనర్హులుగా ప్రకటించారు.
దీనితో సరైన ధ్రు వీకరణపత్రాలు సమర్పిస్తే అర్హుల జాబితాలో పేర్లు చేర్చి ఫించన్లు అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. దీనితో జాబితాలో పేర్లు లేని వృద్ధు లు, వితంతువులు, వికలాంగుల దగ్గర నుంచి కొంతమంది సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. మీ దరఖాస్తులు మా కివ్వండి త్వరగా కంప్యూటర్లలో పేరు ఎక్కించి పింఛన్ ఇప్పిస్తామంటూ హామీలు ఇస్తున్నారు. మరికొందరు మాకు డబ్బులు ముట్టచెబితే చాలు అర్హత ఉన్నా లేకున్నా పింఛన్ ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నారు. ఇందుకోసం రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు.. రేగొండ మండల పరిధిలో ఏకంగా ఓ సర్పంచి ప్రతీ లబ్ధిదారుని నుంచి రూ.200 వసూలు చేశాడు.
డబ్బులు ఇచ్చిన వారి పేర్లు జాబితాలో ప్రత్యక్షమవుతుండగా.. క్యూ లైన్లలో నిల్చున్న వారి పేరు కానరావడం లేదు. కాగా, పింఛన్‌కు జాబితాలో పేరులేని వ్యక్తుల ఆందోళనను కొంత మంది ద్వితీయ శ్రేణి నేతలు సొ మ్ము చేసుకుంటున్నారు. పింఛన్ ఇప్పిస్తామం టూ పైరవీలు చేస్తున్నారు. ఆపై నేరుగా అధికారులు తయూరు చేసేకంప్యూటర్ గదుల్లోకి వెళ్లి.. గంటల తరబడి కూర్చుని తమ వారి దరఖాస్తులను అప్లోడ్ చేస్తున్నారు. పంపిణీ సిబ్బంది ఇష్టారీతిగా వ్యవహరిస్తూ పండుటాకుల ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉన్నతాధికారు ల పర్యవేక్షణ కొరవడటంతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అధికారులు దృష్టిసారించి పైరవీకారులపై, పైసలు వసూలు చేస్తున్న సిబ్బంది చర్య తీసుకోవాలి. పింఛన్ త్వరగా ఇప్పించాలని పండుటాకులు కోరుతున్నారు.