ఉద్యోగుల పంపకాలుషురూ
భద్రాచలం , న్యూస్‌లైన్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేరుపడిన నేపథ్యంలో ఉద్యోగుల పంపకాలు వేగవంతమయ్యాయి. జిల్లాలో పనిచేస్తున్న ఆంధ్రప్రాంతానికి చెందిన ఉద్యోగులు ఎంతమంది ఉన్నారనే దానిపై నివేదికలు సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వెలువడిన వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకునేలా జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఇదిలా ఉండగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇప్పటికే ఉద్యోగుల పంపకాల ప్రకియ ఊపందుకుంది. గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్)లో తెలంగాణ జిల్లాల్లో పనిచే స్తున్న 40 మందిని ఆంధ్ర రాష్ట్రానికి బదిలీ చేయగా, అక్కడ పనిచేస్తున్న 30 మందిని స్థానికత ఆధారంగా తెలంగాణకు కేటాయించారు.
దీనిలో భాగంగా భద్రాచలం ఏజెన్సీ కేంద్రంగా ఉన్న ఇందిరాక్రాంతి పథం కార్యాలయంలో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులను వారి స్థానికత ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేస్తూ సెర్ప్ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రాగా, వీరిలో ఇద్దరి బదిలీల్లో మార్పులు జరిగాయి. భద్రాచలం ఐకేపీ కార్యాలయంలో ఫైనాన్స్ ఏపీఎమ్‌గా పనిచేస్తున్న పీ. రమేశ్‌బాబు, మార్కెటింగ్ ఏపీఎమ్ బీ. శ్రీనివాసులను ప్రకాశం జిల్లాకు బదిలీ చేశారు. వేలేరుపాడు మండల ఏపీఎం పద్మావతిని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి, చర్ల ఏపీఎం లక్ష్మీదుర్గను గుంటూరు జిల్లాకు, వీఆర్ పురం ఇన్చార్జి ఏపీఎం సుధాకర్‌ను తూర్పుగోదావరి జిల్లా వై రామవరానికి బదిలీ చేస్తూ సెర్ప్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.
అయితే సుధాకర్ ఒక్క పదోతరగతి మాత్రమే ఆంధ్ర ప్రాంతంలో చదవగా మిగతా విద్యాభ్యాసంతో పాటు స్థానికంగా కూడా ఖమ్మం జిల్లాకు చెందినవారే. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సెర్ప్ ఉన్నతాధికారులకు అందజేయటంతో అతన్ని ఆంధ్ర ప్రాంతానికి కాకుండా తిరిగి యథాస్థానంలోనే పనిచేసేలా ఆదేశాలిచ్చారు. ఇదే విధంగా చర్ల ఎపీఎం లక్ష్మీదుర్గ బదిలీ ఉత్తర్వులను కూడా మార్పు చేశారు. స్వస్థలం ఆంధ్ర ప్రాంతమే అయినప్పటికీ భర్తది ఖమ్మం జిల్లా కావ టంతో ఆమె విజ్ఞాపన మేరకు తిరిగి చర్లలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో దాదాపు అన్ని శాఖల్లో కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులు, ఉద్యోగులు ఉన్నారు.
వీరంతా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే విధి విధానాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ పనిచేసినా భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అవకాశం వస్తే తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోతామని ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ డివిజన్ స్థాయి ఉన్నతాధికారి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
ముంపులో గందర గోళం : ఉద్యోగుల పంపకాలకు సంబంధించిన నివేదికలు ఓ పక్క సిద్ధమవుతుండగా, జిల్లాలోని ముంపు మండలాల్లో పనిచేస్తున్న వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. ముంపు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎక్కువ మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కాగా, వీరిని తెలంగాణకురప్పిస్తారా..లేదా అక్కడనే కొనసాగమంటారా అనే దానిపై ఇప్పటి వరకూ స్పష్టత లేదు. ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ విషయంలో ఏమీ చెప్పలేకపోతున్నారు. దీంతో ముంపు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన ఏడు మండలాల్లో ఒక్క విద్యాశాఖలోనే వివిధ కేడర్లలో 4,107 మంది ఉన్నారు.
ఉపాధ్యాయులు, నాన్‌టీచింగ్ సిబ్బంది, అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు కలుపుకొని ఇంత మంది పనిచేస్తుండగా, వీరి భవిష్యత్ సర్వీసు అంతా అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్లిపోతుంది. దీన్ని తెలంగాణ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముంపులో పనిచేసే వారికి ఆప్షన్ విధానాన్ని కల్పించి వారు కోరుకున్న రాష్ట్రంలో పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని టీజేఏసీ నాయకులు చల్లగుళ్ల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బదిలీలకు అవకాశం ఇవ్వాలి:
ముంపు మండలాల్లో ఉద్యోగులు ఎటువైపు అనే దానిపై స్పష్టత లేకపోవటంతో ప్రస్తుతం బదిలీపై తమ కోరుకున్న చోటుకు వచ్చేందుకు అక్కడి ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఆయా శాఖల కార్యాలయాల చుట్టూ ఉద్యోగులు తిరుగుతూ ఈ మేరకు విన్నవించుకుంటున్నారు. ఉద్యోగుల పంపకాలపై కేంద్రప్రభుత్వం విధి విధానాలను ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, ముంపులో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ఉద్యోగులకు ముందుగానే బదిలీలకు అవకాశం కల్పించాలనే వాదన బలపడుతోంది. జిల్లా అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకొని ముంపు ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగుల బదిలీల విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఇక్కడి గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు.