రుణాల కోసం ఎదురుచూపులు
- కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు
- మంత్రి పోచారంను కలిసి విన్నవించిన బీసీలు
కలెక్టరేట్: వెనుకబడిన తరగతులను గత కాంగ్రెస్ ప్రభుత్వం మరింత వెనక్కునెట్టింది. బీసీలకు రుణాల విషయంలో చివరకు చేత్తులెత్తేసింది. ఇక కొత్త రాష్ట్రంలో.. కొత్త ప్రభుత్వం తప్పక అందిస్తుందని దరఖాస్తుదారులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. రుణాలు మంజూరు చేయాలంటూ నిరసనలు, ధర్నాలు చేసిన వారు ఇటీవల రాష్ట్రమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతిపత్రాన్నీ అందించారు. జిల్లా బీసీ సంక్షేమశాఖ కూడా రుణాల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
ఆంక్షల జీవో
జిల్లాలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 2,675 మందికి రుణాలు అందించాల్సి ఉంది. వాటిలో రూ.40వేలు మొదలుకుని రూ.రెండులక్షల వరకు రుణసౌకర్యం అందిస్తామని చెప్పారు. రూ.40వేలు రుణం పొందేవారికి రూ.20 వేలు, రూ.50వేలు రుణం పొందేవారికి రూ.25వేలు, రూ.లక్షకు 50వేలు, రూ.2లక్షలకు రూ.లక్ష సబ్సిడీగా ప్రభుత్వం పేర్కొంది. 50శాతం సబ్సిడీ కావడంతో ఎన్నడూ లేనంతగా దరఖాస్తుదారులు బీసీ ార్పొరేషన్ వద్ద క్యూకట్టారు.
బీసీలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రుణాల సబ్సిడీని మరింత పెంచుతామంటూ అప్పటి పాలకులు గొప్పలు చెప్పారు. దీంతో దరఖాస్తుదారులు సంబురపడ్డారు. ఆ తర్వాత సర్కారు అసలు కథ మొదలు పెట్టింది. ఎప్పుడూ లేనివిధంగా రుణాల మంజూరుకు పలు నిబంధనలను విధిస్తూ జీవో నం.101ను విడుదల చేసింది. జీవోలో పేర్కొన్న నిబంధనలతో పాటు రుణాల సబ్సిడీలోనూ కోత విధించింది.
లబ్ధిదారుల సంఖ్యనూ కుదించి, బీసీలపై వివక్ష చూపింది. జీవో నం. 101పై అప్పట్లో ఎన్నికల ముందు పెద్ద దూమారం లేసింది. బీసీలపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. పలు ఆంక్షలతో ఆర్థిక సంవత్సరం మరో వారంలో ముగుస్తుండగా.. రుణాల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆర్థిక సంవత్సరం ముగింపుతో పాటు ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రుణాలు అలాగే ఉండిపోయాయి. బీసీలకు ఒక్క పైసా అందలేదు.
రుణాలపైనే ఆశలు
వెనుకబడిన తరగతులకు చెందిన చాలామంది బీసీ కార్పొరేషన్ రుణాలపైనే ఆశలు పెట్టుకున్నారు. రుణాలు అందితే బతుకుదెరువుకు ఆసరా ఉంటుందంటున్నారు. సారీసెంటర్, బ్యాంగిల్స్టోర్, కిరాణ మర్చంట్, ఫొటోస్టూడియో, జిరాక్స్‌సెంటర్, గొర్రెల పెంపకం తదితర యూనిట్లకు రుణాలు కోసం దరఖాస్తులు చేసుకున్నారు.
ఎంతోఆశతో దరఖాస్తుదారులు బ్యాంకర్ల కాళ్లావేళ్లా పడి బ్యాంకు అర్హత పత్రాలు తీసుకువచ్చి దరఖాస్తు చేసుకున్నారు. రూ.50వేలు, రూ.లక్ష, రూ.2లక్షల వరకు రుణాల కోసం బ్యాంకు అర్హత పత్రాలతో దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సబ్సిడీ, లబ్ధిదారుని సీరియల్ నంబర్ కూడా అందించారు. కానీ చివరికి రుణాలు ఇవ్వకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిదారి పట్టింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించి రుణాలను త్వరితగతిన అందించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.