జిల్లాలో 570 మైనింగ్ లీజుల రద్దుకు సిఫార్సు
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని 570 గనుల లీజులను రద్దు చేయాలని జిల్లా భూగర్భ గనులశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడడంతోపాటు నిర్ధిష్ట కాలంలో రిటర్న్‌లు సమర్పించకపోవడం, ఖనిజం తవ్వకాలు చేపట్టకపోవడాన్ని గుర్తించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో జిల్లా పరిధిలోని 3,321 హెక్టార్లలో మైనింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.
జిల్లా భూగర్భగనుల శాఖ అధికారుల ప్రతిపాదనల మేరకు సోమవారం జిల్లాకు చెందిన మూడు లీజులను ప్రభుత్వం ఖనిజ రాయితీల చట్టం (1960)లోని సెక్షన్ 28 (1) కింద రద్దు చేసిన విషయం విదితమే. నిబంధనలు పాటించని గనుల లీజులను రద్దు చేయాలంటూ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన నేపథ్యంలో జిల్లాకు సంబంధించి అధిక మొత్తంలోనే లీజులు రద్దయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని నిబంధనలు పాటించని మిగిలిన గనుల లీజులు రద్దయ్యే అవకాశమున్నట్లు సమాచారం.
మైనింగ్ లీజుల వివరాలు..
చిత్తూరు జిల్లాలో కుప్పం, పలమనేరు, మదనపల్లి, పుంగనూరు, పీలేరు ప్రాంతాలలో గ్రానైట్, రోడ్డు మెటల్, గ్రావెల్ గనులు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం చిత్తూరు భూగర్భగనుల శాఖ కింద 36 మండలాల పరిధిలో మేజర్ మినరల్‌కు సంబంధించి 22 క్వార్జ్ గనుల లీజులుండగా, వాటిలో నాలుగు మాత్రమే ప్రస్తుతం వర్కింగ్‌లో ఉన్నాయి. 18 లీజులకు సంబంధించిన గనుల్లో ఎటువంటి పనులు జరగడం లేదు. మైనర్ మినరల్‌కు సంబంధించి గ్రానైట్, రోడ్ మెటల్ తదితర గనుల లీజులు 521 ఉండగా 173 గనులలో పనులు జరగడం లేదు.
ఈ డివిజన్ పరిధిలో వివిధ రకాలకు సంబంధించి మొత్తం 694 లీజుల్లో 173 గనుల్లో పనులు జరగడం లేదు. ఈ మొత్తం గనులకు సంబంధించి దాదాపు 1940 హెక్టార్ల ప్రభుత్వం భూములను కేటాయించింది. గంగవరం భూగర్భగనుల శాఖ పరిధిలోని 30 మండలాల్లో మేజర్ మినరల్ క్వార్జ్, గ్రానైట్, రోడ్ మెటల్ మొత్తం కలిపి 803 లీజులుండగా, ఇందులో 406 మాత్రమే వర్కింగ్‌లో ఉన్నాయి. మిగిలిన 397 లీజులు నాన్ వర్కింగ్‌లో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 570 మైనింగ్ లీజులు నాన్ వర్కింగ్‌లో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటికోసం గంగవరం పరిధిలో ప్రభుత్వం 1381 హెక్టార్ల ప్రభుత్వ భూములు కేటాయించింది.
నిబంధనలు ఇలా..
మేజర్ మినరల్స్ క్వార్జ్ గనులకు సంబంధించి రెండు సంవత్సరాలుగా నాన్వర్కింగ్లో ఉంటే లీజు రద్దు చేయవచ్చు. మొదట భూగర్భ శాఖాధికారులు లీజుదారునికి నోటీసులు అందజేస్తారు. తరువాత లీజుదారుడు ప్రభుత్వానికి రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలి. సమాధానం సంతృప్తికరంగా లేకుంటే డెరైక్టర్ ఆఫ్ మైన్స్ (డీయంజీ)కు లీజు రద్దు చేసే అధికారం ఉంది.
గ్రానైట్ గనుల లీజులకు సంబంధించి ఆరునెలలుగా పర్మిట్ తీసుకోకపోయినా, రెండేళ్లు నాన్ వర్కింగ్‌లో ఉన్నా, ప్రతి సంవత్సరం డెడ్ రెడ్ (స్థిర అద్దె) కట్టకపోయినా ఏడీ మైన్స్ ప్రతిపాదనల మేరకు నోటీసు, సమాధానం పద్ధతిలోనే లీజు రద్దు చేసే అధికారముంది. రోడ్డు మెటల్స్, గ్రావెల్స్కు ఆరు నెలలుగా పర్మిట్లు తీసుకోకపోయినా, ఏడాది పాటు డెడ్ రెడ్ చెల్లించకపోయినా, నాన్ వర్కింగ్‌లో ఉన్నా లీజును రద్దు చేసే అధికారం ఉంది.