రాజకీయాల కోసమే ముద్రగడ ఉద్యమం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : కాపుల కోసమంటూ ముద్రగడ చేస్తున్న ఉద్యమం సమంజసంగా లేదని, ఆయన కేవలం రాజకీయం కోసమే ఉద్యమాలు చేస్తున్నట్టు ఉందని జిల్లా ఇన్చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. తమిళనాడులో జల్లికట్టుకు రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు ముడిపెట్టడం సరికాదని చెప్పారు. మంగళవారం స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు నెలలకోసారి నిద్రలేచి ప్రకటనలకే పరిమితమయ్యే పవన్‌కల్యాణ్‌కు అనుభవం లేదని, అందుకే అటువంటి ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు ప్రధాని నరేంద్రమోదీతో కలిసి హెలికాఫ్టర్లలో తిరిగేంత చనువు ఉందని, ఏదైనా సమస్య అనిపిస్తే మోదీతోనే మాట్లాడాలని హితవు పలికారు. అంతకుముందు టీడీపీ సమన్వయకమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను ఆయన వెల్లడించారు. గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకు పునాదులు కట్టుకున్న వారికి ఇళ్లు నిర్మించే అవకాశం లేకుండా తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించి వారికి కూడా నిధులు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రిని కోరాలని సమావేశంలో తీర్మానించామన్నారు. ద్వారకాతిరుమలలో ఏర్పాటు చేసిన విర్డ్ ఆసుపత్రిలో కూడా ఎన్టీఆర్ వైద్య సేవలు అమలు చేయాలని కోరతామన్నారు. త్వరలో జిల్లాలో ఖాళీకానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ పలువురు ఆశావహులు మంత్రులు అయ్యన్న పాత్రుడు, పీతల సుజాత, పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్షి్మలకు వినతిపత్రాలు సమర్పించారు.