ఆదాయం పెరిగింది
తాండూరు: ఐదు జిల్లాల మార్కెట్ కమిటీల్లో గత ఏడాది కంటే ఈసారి మార్కెట్ ఫీజు ఆదాయం పెరిగిందని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ హైదరాబాద్ రీజియన్ డిప్యూటీ డెరైక్టర్ మల్లేశం వెల్లడించారు. సోమవారం ఆయన తాండూరు మార్కెట్ కమిటీని సందర్శించారు. మార్కెట్ కమిటీలో పప్పుధాన్యాల కొనుగోళ్లు, మార్కెట్ఫీజు తదితర రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2014-15 ఆర్థిక సంవత్సరానికి మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలోని 63 మార్కెట్ కమిటీల మార్కెట్ ఫీజు లక్ష్యం రూ.113 కోట్లని వివరించారు.
ఇందులో ఈ ఏడాది ఆగస్టు వరకు రూ.42.67 కోట్ల మార్కెట్ ఫీజు వసూలైందన్నారు. 2013 ఆగస్టులో ఆయా మార్కెట్ల నుంచి రూ.37.49కోట్ల మార్కెట్ ఫీజు వసూలైనట్టు చెప్పారు. ఈ లెక్కన ఈసారి రూ.5.17 కోట్లు అదనంగా మార్కెట్ ఫీజు వచ్చిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ మార్క్‌ఫెడ్‌తోపాటు పౌరసరఫరాల శాఖ ఐకేపీల ద్వారా మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోళ్లపై మార్కెట్ ఫీజు చెల్లించినందునే ఈసారి అదనంగా ఫీజు వసూలైందన్నారు. అంతకుముందు డీడీ మార్కెట్ కమిటీ మూడో శ్రేణి కార్యదర్శి సురేందర్‌రెడ్డి, సూపర్వైజర్ హబీబ్ అల్వీతో సమావేశమై ఆహార ఉత్పత్తుల రాక, మార్కెట్ ఫీజు వసూలు తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ-బిడ్డిండ్ ద్వారా కొనుగోళ్లు
మార్కెట్ యార్డుల్లో ఆహార ఉత్పత్తుల క్రయవిక్రయాలు, పంట ధరల నిర్ణయాలు తదితర కార్యకలాపాలన్నీ ఇక నుంచి ఆన్లైన్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మల్లేశం పేర్కొన్నారు. మార్కెట్లో ఉత్పత్తుల క్రయవిక్రయాల్లో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. యార్డుల్లో ప్రస్తు తం పంట ఉత్పత్తులకు కమీషన్ ఏజెం ట్లు బహిరంగ వేలం పాట ద్వారా ధర నిర్ణయిస్తున్నారన్నారు.
ఇకపై యార్డులను కంప్యూటరీకరిస్తామని, ఈ-బిడ్డింగ్ ద్వారా నే పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరుగుతాయని చెప్పారు. ప్రాథమికంగా ఈ-బిడ్డింగ్ కోసం నిజామాబాద్, వరంగల్, మిర్యాలగూడ, కే.సముంద్రం మార్కెట్ యార్డులను ఎంపిక చేశామన్నారు. కమీషన్ ఏజెంట్లు తాము కొనుగోలు చేయాలనుకున్న పంట ఉత్పత్తులకు ఎంత ధర చెల్లించాలనుకుంటున్నారో కోడ్ల ఆధారంగా ఈ-బిడ్డిండ్ ద్వారానే నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. రైతులు పంట ను యార్డులోపలికి తీసుకువచ్చినప్పటి నుంచి బయటకు వెళ్లే వరకు అన్ని వివరాలు ఆన్లైన్లో నమోదవుతాయన్నారు.
పెరిగిన పత్తి సాగు విస్తీర్ణం..
రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో గత ఏడాది కంటే ఈసారి సుమా రు 41వేల హెక్టార్లలో పత్తి పంట సాగు విస్తీర్ణం పెరిగిందని మల్లేశం అన్నారు. పత్తి కొనుగోలుకు కొత్తగా తాండూరు, మర్పల్లి, ఇబ్రహీంపట్నం, సదాశివపేట, వట్పల్లి, గద్వాల్, అచ్చంపేట, కల్వకుర్తిలలో పత్తి (సీసీఐ)కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు.
అక్టోబర్ నాటికి ఈ కేంద్రాలు అందుబాటులోకి వస్తాయన్నారు. గతంలో మాదిరిగా చెక్‌ల రూపంలో కాకుండా పత్తి రైతులకు ఈసారి డబ్బులను ఆన్లైన్లో చెల్లించాలని ప్రభుత్వం సీసీఐకి ఆదేశాలిచ్చిందని తెలిపారు. 48గంటల్లోనే డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసిందని అన్నారు. మీసేవ, వీఆర్ఓ నుంచి భూమి వివరాల ధ్రువీకరణ పత్రాల, బ్యాంకు ఖాతా జిరాక్స్ ప్రతిని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాల్సి ఉంటుందన్నారు. బస్తాల్లో కూడా ఈసారి పత్తిని లూజ్‌గా తెచ్చినా కొనుగోలు చేస్తారని ఆయన చెప్పారు.