స్వైన్ ఫ్లో.. జాగ్రత్తలు పాటించండి..
సాక్షి, మంచిర్యాల : రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ చాపకింద నీరులా విజృంభిస్తోంది. ఆరేళ్ల క్రితం రాష్ట్రాన్ని వణికించిన ఈ మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. ఈ వ్యాధితో ఆయా జిల్లాలో మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇందులో భాగంగానే జిల్లాకు స్వైన్‌ఫ్లూ నివారణ నోడల్ అధికారిని నియమించారు.
ఇదిలా ఉంటే.. స్వైన్‌ఫ్లూపై ఇప్పటికే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. చలికాలం కావడం.. జలుబు వైరస్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉండడం.. స్వైన్‌ఫ్లూ కూడా అదే కోవాకు చెందడంతో ముందస్తు చర్యలు తీసుకుంటోంది. అందుకే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బంది హెచ్1ఎన్1 వ్యాక్సిన్లను పంపిణీ చేస్తోంది.
వీటికితోడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామీణ ప్రాంతాల్లో ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, ఐసీడీఎస్, ఏఎన్ఎంలతో విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. ఎక్కైడె నా వ్యాధి లక్షణాలు కనిపిస్తే సదరు రోగికి తక్షణ చికిత్స అందించేలా సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో తీవ్రత ఎక్కువగా ఉండడంతో.. జిల్లా నుంచి అక్కడికి వెళ్లే వారి సంఖ్య భారీగానే ఉంది. ఎంతో మంది అక్కడే స్థిరపడ్డమే కాకుండా.. తరచూ ఇక్కడికి వస్తూ పోతున్నారు. అలాంటి వారు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి రుక్మిణమ్మ సూచించారు. వ్యాధి లక్షణాలున్నట్లు అనుమానం వస్తే.. వెంటనే సమీప ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు.
స్వైన్‌ఫ్లూ అంటే..?
తెల్ల పందిలో దాగి ఉండే స్వైన్‌ఫ్లూ వైరస్ మనిషి శరీరంలో ప్రవేశిస్తుంది. స్వైన్ అంటే పంది. ఫ్లూ అంటే ఇన్ఫ్లూయెంజ విభాగానికి చెందిన వైరస్‌తో వ్యాప్తి చెందే జలుబు. ఈ రకమైన వైరస్ తరచూ తనలో ఉన్న జన్యువులను ఇతర వైరస్‌లతో మార్చుకోవడంతో కొత్త రకం వైరస్లు పుట్టుకొచ్చి ఫ్లూ జ్వరం కలుగజేస్తుంటాయి.
పంది శ్వాసకోశ వ్యాధికి కారణమయ్యే ఒక వైరస్‌లోని జన్యువులతో పోలి ఉంటుంది. పందుల్లో ఉండే వైరస్ తన యాంటి జెనిక్ స్వరూపాన్ని మార్చుకుని మనుషుల్లో వ్యాప్తి చెందడంతో స్వైన్‌ఫ్లూగా పేరుపెట్టారు. ‘ఇన్‌ఫ్లూయెంజా ఏ’ రకానికి చెందిన వైరస్ కేవలం మనుషుల నుంచి మనుషులకే సంక్రమిస్తుంది. స్వైన్‌ఫ్లూను వైద్యులు తమ పరిభాషలో హెచ్1ఎన్1 అని పిలుస్తారు.
ఎదుటివారికీ ముప్పే..
చలికాలంలో జలుబు వైరస్లు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్వైన్‌ఫ్లూ కూడా ఇదే తరహాలో వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి గాలి ద్వారా సంక్రమిస్తుంది. బాధిత రోగి జాగ్రత్తలు పాటించకపోతే అది ఎదుటి వారికీ సంక్రమించే ప్రమాదం ఉంది. దగ్గు, తుమ్ము వస్తే.. తుంపర్లు ఎదుటివారిపై పడకుండా చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. చేతులపై తుంపర్లు పడితే.. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఫ్లూ సోకిన వారి నుంచి ప్రజలు దూరంగా ఉండాలి.
లక్షణాలు..
వ్యాధి సోకిన వ్యక్తికి ఇది ఫ్లూ జ్వరంలాగే కనిపిస్తుంది. వ్యాధి సోకిన వారు తీవ్ర జ్వరం, జలుబు (ముక్కు నుంచి నీరు కారుతుంది), గొంతులో ఇన్ఫెక్షన్, తలనొప్పి, చలి, శరీర నొప్పులు, దగ్గు, నీరసం, అలసటతో బాధపడతారు. వాంతులు, విరేచనాలు అయినప్పుడు స్వైన్‌ఫ్లూగా అనుమానిస్తారు. సాధారణంగా జ్వరం మూడు నుంచి ఏడు రోజుల వరకు ఉంటుంది. కానీ స్వైన్‌ఫ్లూ రోగికి ఎక్కువ రోజులు ఈ లక్షణాలు కనిపిస్తాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో చిన్నారుల్లో ఈ జబ్బు శరవేగంగా వ్యాప్తి చెందుతుంది.
శ్వాస తీసుకోవడం, చర్మం నీలిరంగుగా మారడం, నీళ్లు, ద్రవ పదార్థాలు తీసుకోకపోవడం, త్వరగా నిద్రలేవలేకపోవడం, జ్వరం తగ్గినా, దగ్గు తగ్గదు. పెద్దలలో ఆయాసం, ఛాతి, పొట్టలో నొక్కేస్తున్నట్లు నొప్పి, వాంతులు ఉంటే స్వైన్‌ఫ్లూ వెంటనే పరీక్ష చేయించుకోవాలి. విదేశాల్లో ఉండి వచ్చిన వారికి అప్పుడే వ్యాధి నిర్ధారణ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు వెలుగులోకి వచ్చే వీలుంటుంది. వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.