జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, చైర్మన్ల సమన్వయంతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లికృష్ణారావు అన్నారు. ఆదివారం స్థానిక అన్నపూర్ణగార్డెన్స్‌లో పీఆర్టియు తెలంగాణ ఆధ్వర్యంలో మంత్రులు, ఎంపీ, జెడ్పీఛైర్మన్, ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదన్నారు. అయితే కొన్ని ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణ వ్యతిరేకులకు అండగా నిలవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగానే రెండు మంత్రిపదవులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, పార్లమెంటరీ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారన్నారు. ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. ఉపాధ్యాయులు నిబద్దతతో పనిచేస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలన్నారు.
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేయనున్నందున ఇంగ్లీష్‌మీడియంలో బోధించేందుకు ఉపాధ్యాయులు సిద్దంగా ఉండాలన్నారు. మేనిఫెస్టోలో పేర్కొ న్న ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నా రు. జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు చర్య లు తీసుకుంటామన్నారు. పరి శ్రమల స్థాపనకు ముందుకు వస్తే అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఇందుకుగాను ఆన్లైన్లో పరిశ్రమల సమాచారం ఉంచామని, దరఖాస్తు చేసుకున్న వారికి 15రోజుల్లో అనుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తామన్నారు.
కోతలు లేని విద్యుత్
జిల్లాలో రైతులు ఎక్కువగా బోర్లపై ఆధారపడినందున కోతలు లేని విద్యుత్‌ను అందించేందుకు చర్యలు తీసుకుంటామని విద్యుత్‌శాఖామంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. మంత్రులమైనా ఉద్యమ కారులలాగే పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధే కేసీఆర్ ధ్యేయమని, జిల్లాలో వెయ్యిమెగావాట్ల సోలార్‌ప్లాంటును ఏర్పాటు చేస్తామనిచ మైనార్టీ స్టడీ సర్కిల్, పాస్‌పోర్టు ఆఫీసును ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఉద్యమంలో ఉపాధ్యాయుల సహకారం మరువలేనిదన్నారు. అనంతరం జెడ్పీచైర్మన్, ప్రణాళికాసంఘం డిప్యూటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఉపాధ్యాయ సంఘం నేతలు మాట్లాడారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు విఠల్‌రావు ఆర్య, బెక్కెం జనార్ధన్, సాయిరెడ్డి, చలపతిరావు, బాల్‌రెడ్డి, నిస్సీ డెబోరా, యుగంధర్‌రెడ్డి, దుంకుడ శ్రీనివాస్, చెన్నప్ప, వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.