కబ్జా హఠావో.. వక్ఫ్ బచావో
ఖమ్మం మామిళ్లగూడెం: జిల్లా అధికారులు నిర్లక్ష్య వైఖరిని విడనాడి వక్ఫ్ ఆస్తులను కాపాడాలని కోరుతూ ముస్లిం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఖమ్మంలో శనివారం శాంతి ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ఉర్దూఘర్ షాదీఖానా నుంచి ఈ ప్రదర్శన బయల్దేరింది. నగరపాలక సంస్థ కార్యాలయం, బస్టాండ్, వైరారోడ్డు, జెడ్పీసెంటర్ మీదుగా హజ్రత్ తాలీమ్ మస్తాన్ దర్గా వరకు కొనసాగింది.
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.అసద్ మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష వైఖరి వల్లే జిల్లాలో వక్ఫ్ భూములు ఆక్రమణకు గురయ్యాయని విమర్శించారు. వక్ఫ్చట్టం 1995ను అనుసరించి ఆక్రమణదారులను సెక్షన్ 54(1), 54(3), 55 ప్రకారం తొలగించాల్సి ఉన్నా కలెక్టర్, ఆర్డీఓలు ఊదాసీనంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఖమ్మంలోని ఏడెకరాల విస్తీర్ణంలో ఉన్న తాలీమ్ మస్తాన్ దుర్గాకు చెందిన వక్ఫ్ భూమి (సర్వే నంబర్లు 264, 265)ని 132 మంది ఆక్రమించుకున్నారని తెలిపారు.
ఆక్రమణదారులు స్వచ్ఛందంగా భూమిని వదిలి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. తెలియక చేసిన తప్పు క్షమార్హమని, అదే తెలిసి చేస్తే సహించరానిదని వ్యాఖ్యానించారు. మహాత్మగాంధీ తలపెట్టిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ‘వక్ఫ్ బచావో’ పేరుతో శాంతి ర్యాలీని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి బాణోతు భద్రూనాయక్, ముస్లిం మైనారిటీ ఆర్ఎంపీల సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ నజీరుద్దీన్, వైఎస్సార్సీపీ నగర కన్వీనర్ సయ్యద్ షుజా, బీసీ సంఘం నాయకురాలు షేక్ సకీనా, కాంగ్రెస్ నాయకులు అక్బర్ , రజీ మ్, దర్గా కార్యదర్శి మధా ర్, ఇన్సాఫ్ కమిటీ నాయకులు యాఖూబ్, ముజావర్ అక్బర్, జాకీర్ పాల్గొన్నారు.